Pawan kalyan: పొలిటికల్‌ ‘పవర్‌’స్టార్‌.. ఇదీ జనసేనాని పోరాట ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పవన్‌కల్యాణ్‌ జనసేన కీలక పార్టీగా అవతరించింది. 2014లో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసేవరకూ సాగిన రాజకీయ ప్రస్థానమిదీ..

Updated : 05 Jun 2024 07:10 IST

‘‘కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం మాత్రం పక్కా’’ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పలికిన సంభాషణే ఇది. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. కానీ, అధ్యక్షా అని పిలవడానికి పదేళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్‌ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు.. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ, పవన్‌ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్‌.. ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేయబోతున్నారు. పదేళ్లు పదవి, అధికారం వంటివి లేకుండా ‘అజ్ఞాతవాసం’లాంటి జీవితం సాగించిన పవన్‌ ఇప్పుడు.. అధ్యక్షా అంటూ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.

విలాస జీవితం వదిలి...

సూట్‌ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటిముందు నిలబడే నిర్మాతలు.. విలాసవంతమైన జీవితం.. ఫారిన్‌ ట్రిప్పులు.. ఇవేవీ పవన్‌కల్యాణ్‌కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్లినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన. ‘తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి’. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడమంటే పులి మీద స్వారీ. దాన్ని చాలా దగ్గరినుంచి చూశాడు. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏ జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. ఎన్డీయేతో మైత్రీని కొనసాగించారు.

రెండు స్థానాల్లోనూ ఓడిపోయి..

ఐదేళ్లు గిర్రున తిరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. 2014లో తెదేపాకు మద్దతు పలికిన పవన్‌కల్యాణ్‌.. 2019కి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో  తెదేపాకు దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకొనేది రెండు (తెదేపా, వైకాపా) బలమైన శక్తులని తెలుసు. కానీ, కార్యదీక్షతో ముందుకు కదిలారు. ఫలితం ఒకే ఒక్క స్థానంలో గెలుపు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు. కానీ అక్కడున్నది పవన్‌ కల్యాణ్‌. తనతో పాటు, పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు.

పదేళ్లు మొక్కవోని దీక్షతో..

సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడికైనా ఒకవిధమైన నిర్లిప్తత ఆవరిస్తుంది. కానీ, జనసైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్‌ సన్నద్ధం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైకాపాపై వెంటనే దుమ్మెత్తిపోయడం సరికాదన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తూ దాదాపు ఏడాది పాటు పెద్దగా విమర్శల జోలికి పోలేదు. నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైకాపా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడింది. దీంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైకాపా ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీఇన్నీ కావు. వాటిని కాచుకుని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు. ‘సీఎం.. సీఎం’ అని అభిమానులంటే ‘ముందు నన్ను గెలిపించండి..’ అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌కల్యాణ్‌. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే.. తన పార్టీ ఫండ్‌తో ఆ కుటుంబాలకు ఆర్థికసాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.

తెదేపాకు అండగా నిలిచి..

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహ ధర్మం పాటించిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌. తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న తెదేపా శ్రేణులకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వెళ్లి మరీ తెదేపాకు మద్దతు పలికారు. చంద్రబాబు, తెదేపాను నిర్వీర్యం చేసేందుకు జగన్‌ చేసిన ముప్పేటదాడిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి.. మంత్రులూ మూకుమ్మడి దాడి చేసినా..

ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని.. వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగదీయడం. వైకాపాలో ఇలాంటి గురివింద గింజలు చాలానే ఉన్నాయి. అవన్నీ వంతుల వారీగా పవన్‌ను అనరాని మాటలు అన్నాయి. తెదేపాకు మద్దతుగా నిలిచిన తర్వాత ఆ విమర్శలు తారస్థాయికి చేరాయి. రాజకీయంగా, పార్టీ సిద్ధాంతాల పరంగా విమర్శలు చేయడం ఏమాత్రం తప్పు లేదు. కానీ, వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతూ వైకాపా నాయకులు చేసినన్ని నీచ రాజకీయ విమర్శలు దేశంలో ఏ పార్టీ చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేయడం బహుశా ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. వైకాపా నాయకులు కయ్యానికి ఎంతలా కాలు దువ్వినా పవన్‌ మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. తన శ్రేణులను కోల్పోనివ్వలేదు.

కూటమికి బాటలు వేసి..

ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కలవడంలో పవన్‌కల్యాణ్‌ది కీలక పాత్ర. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జగన్‌ దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్న తెదేపాకు స్నేహహస్తం అందించారు. తన పార్టీ వర్గాలతో పాటు, తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం తెదేపాతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు. సైద్ధాంతికపరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా, వైకాపా అరాచక పాలన అంతం చేయడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్‌ తానే ఒక అడుగు ముందుకువేశారు. ఇందులోభాగంగానే తెదేపా, భాజపాల మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పడటానికి సూత్రధారి, పాత్రధారి అయ్యారు. ఆ ప్రయత్నం నేడు ఏపీలో ఫలించి కూటమి విజయానికి ప్రధాన కారణమైంది.

ఎక్కడ నెగ్గాలో కాదు.. తగ్గాలో తెలుసు

2024 ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌కు ఎదురైన అతిపెద్ద సవాల్‌ సీట్ల సర్దుబాటు. తెదేపాతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అని. ఎన్నికలకు ముందు తెదేపాకు ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు సరికదా.. ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలబడ్డారు. ఈ దశలో పవన్‌కల్యాణ్‌ ఎన్ని సీట్లు అడగాలో ప్రతిఒక్కరూ సలహాలిచ్చేవాళ్లే. కానీ, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసి, తక్కువ సీట్లు తీసుకుని, అన్ని స్థానాల్లో గెలవాలన్న అజెండాతో ముందుకువచ్చారు. ‘ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు. స్ట్రైక్‌రేట్‌ ముఖ్యం’ అంటూ శ్రేణులను సముదాయించడంతో పాటు, విమర్శలకు దీటైన జవాబిచ్చారు. తన డిమాండ్‌ వల్ల కూటమి, తన రాజకీయ లక్ష్యం దెబ్బతినకూడదని ఒక అడుగు వెనక్కి వేశారు. నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ, ముందుగా ఏపీలో జనసేన గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాదు.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. భారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసింది కేవలం ఏడాది మాత్రమే అయినా.. అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పవన్‌ పదేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఈ దశాబ్ద కాలం పాటు పవన్‌ చూపిన పోరాట పటిమను కొనసాగిస్తే.. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్త ‘పవనా’లు వీయడమే కాదు, ఒక బలమైన శక్తిగానూ ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు