మహా యుద్ధం

మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Updated : 19 May 2024 07:43 IST

ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాలపై ఉత్కంఠ
20న పోలింగ్‌

హారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఉమ్మడి శివసేనకు పట్టున్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బాలాసాహెబ్‌ ఠాక్రే వారసత్వ ప్రాభవం ఒకవైపు.. ముంబయిలో మెగా ప్రాజెక్టుల పూర్తి మరోవైపు ఇక్కడి పోటీని ఆసక్తిగా మలిచాయి. శిందే తిరుగుబాటును, ధరల పెరుగుదలను, ధారావి ప్రాజెక్టులో అదానీ ప్రవేశాన్ని ఉద్ధవ్‌ సేన ప్రశ్నిస్తోంది. ఉద్ధవ్‌ ఠాక్రే ముంబయితోపాటు ఠాణె, కల్యాణ్‌ ప్రాంతాల్లో తమ కుటుంబ ప్రాభవాన్ని గుర్తు చేస్తున్నారు. తమదే అసలైన శివసేన అని నిరూపించేందుకు పోరాడుతున్నారు. మరోవైపు శివసేన, ఎన్సీపీలను చీల్చిన భాజపా కొంత ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలకు అనుబంధంగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. 


 గిరిజన ప్రాబల్యం

  • ముంబయికి ఉత్తరాన ఉన్న ధులే నియోజకవర్గంలో గిరిజనుల ప్రాబల్యం ఉంటుంది. వ్యవసాయమే ప్రధాన వృత్తి. వర్షాధారంగానే పంటలు పండుతాయి. పాల ఉత్పత్తిలో ఈ ప్రాంతానికి మంచి పేరుంది.
  • 1996దాకా కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాతి నుంచి భాజపా, కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తున్నాయి. 2009, 2014, 2019లలో భాజపా గెలిచింది. ఈసారి భాజపా నుంచి సుభాష్‌ రాంరావ్, కాంగ్రెస్‌ తరఫున శోభా దినేశ్‌ పోటీ చేస్తున్నారు. వీబీఏ, మజ్లిస్‌ పోటీలో లేకపోవడంతో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు సాగుతోంది. గత 15ఏళ్లుగా ముస్లిం ఓట్ల విభజనతో భాజపా లబ్ధి పొందుతోంది. ఈసారి ఆ పరిస్థితి లేదు.

 గుజరాత్‌ పొరుగు

  • గుజరాత్‌ సరిహద్దుల్లో ఉండే డిండౌరీ ప్రజల్లో ఎక్కువ మంది అక్కడే ఉద్యోగాలు చేస్తుంటారు. స్వామి సమతా ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఉంది. ఆధునిక గ్రామాలతోపాటు గిరిజన ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. ఉల్లి, ద్రాక్ష భారీగా ఉత్పత్తి అవుతాయి.
  • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ భారతీ ప్రవీణ్‌ పవార్, ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌) నుంచి భాస్కర్‌ మురళీధర్‌ భగారే పోటీ చేస్తున్నారు. ఈసారి భారతీ పవార్‌ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

గోదావరి తీరం

  • గోదావరి తీరాన ఉన్న నాసిక్‌ పురాతన నగరం. ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. 2014, 2019లో అవిభాజ్య శివసేన నేత హేమంత్‌ గాడ్సే విజయం సాధించారు. ఇక్కడ 60శాతం మంది మరాఠాలు ఉన్నారు. దీంతో రెండు పార్టీలు మరాఠా నేతలకే టికెట్లు ఇచ్చాయి.
  • ఈ సారి శివసేన విడిపోవడం, భాజపాతో పొత్తు చెదరడంతో రెండు శివసేనల మధ్యే పోరు సాగుతోంది. శిందే వర్గం నుంచి హేమంత్‌ గాడ్సే, ఉద్ధవ్‌ వర్గం తరఫున రాజభావ్‌ వాజే పోటీ చేస్తున్నారు. ఉద్ధవ్‌ వర్గానికే కాస్త మొగ్గు కనిపిస్తోంది.  

కొంకణీల అడ్డా

  • కోలీ, కొంకణీల అడ్డా భివండీ. చిన్న పట్టణంగా ఉన్న ఇది వస్త్ర పరిశ్రమల రాకతో నగరంగా మారింది. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది పవర్‌ లూమ్‌ పరిశ్రమల్లో పనిచేస్తారు. తెలుగువారూ ఇక్కడ అధికంగానే ఉంటారు.  
  • 2014, 2019లలో భాజపా ఇక్కడ విజయం సాధించింది. మరోసారి ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కపిల్‌ పాటిల్‌ భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. శరద్‌ పవార్‌ పార్టీ నుంచి సురేశ్‌ మాత్రే బరిలోకి దిగారు. గ్రామాల్లో చాలాకాలం నుంచి పని చేస్తున్న నీలేశ్‌ వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. 

కోట గోడ

  • మొగలుల హయాంలో కల్యాణ్‌లోని కోట చుట్టూ పెద్ద గోడను నిర్మించారు. ప్రస్తుతం ముంబయి శివార్లలో ఉన్న అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. 
  • 2014, 2019లలో ఇక్కడి నుంచి సీఎం ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే గెలిచారు. హ్యాట్రిక్‌ సాధించేందుకు మరోసారి బరిలోకి దిగారు. ఉద్ధవ్‌ సేన నుంచి వైశాలి దరేకర్‌-రాణె పోటీ చేస్తున్నారు. ఆదిత్య ఠాక్రే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. దీంతో శ్రీకాంత్‌ శిందే గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. 

ముంబయికి పెద్దక్క

  • ముంబయికి పెద్దక్కగా పిలిచే ఠాణె కెమికల్, ఇంజినీరింగ్, వస్త్ర పరిశ్రమలున్న పెద్ద ప్రాంతం. తయారీ, ఐటీ రంగాల్లో భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. ఇక్కడ మరాఠీ, హిందీ, ఆంగ్లం మాట్లాడుతుంటారు.
  • 2014, 2019లలో ఇక్కడి నుంచి అవిభాజ్య శివసేన గెలిచింది. ఈసారి ఉద్ధవ్‌ వర్గం నుంచి ఎంపీ రాజన్‌ విఖారే, శిందే వర్గం తరఫున నరేశ్‌ గణపత్‌ మాస్కే పోటీ చేస్తున్నారు. శివసేనకు ఇది కంచుకోట.. అయితే ఏ సేనకు జనం మద్దతు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది. 

మత్స్యకారుల నేల

  • మత్స్యకారులు, గిరిజనులు, మధ్య తరగతి వారుండే ప్రాంతం ఉత్తర ముంబయి నియోజకవర్గం. ఇది తీర, అటవీ ప్రాంతాలతో నిండి ఉంటుంది. 
  • 2014, 2019లలో భాజపా గెలిచింది. ఈసారి భాజపా తరఫున కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, కాంగ్రెస్‌ నుంచి భూషణ్‌ పాటిల్‌ పోటీ చేస్తున్నారు. భాజపాకు ఇది సురక్షిత స్థానం. 

తొలి అణు విద్యుత్తు కేంద్రం

  • గిరిజన ప్రాబల్యమున్న పాల్ఘర్‌లో హిందీ మాట్లాడేవారు గణనీయంగా ఉంటారు. భారత తొలి అణు విద్యుత్తు కేంద్రం ఇక్కడి తారాపుర్‌లో ఉంది. సపోటా ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
  • 2014, 2019లలో శివసేన ఇక్కడ గెలిచింది. ఈసారి భాజపా అభ్యర్థిగా హేమంత్‌ విష్ణు సావరా, ఉద్ధవ్‌ వర్గం నుంచి భారతీ భరత్‌ కామ్డీ, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (వీబీఏ) నుంచి విజయ్‌ రాజ్‌కుమార్‌ మాత్రే తలపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉద్ధవ్‌ చేసిన అభివృద్ధిపై శివసేన (ఉద్ధవ్‌) ఆధారపడుతోంది. హిందువుల ఓట్లపై భాజపా ఆధారపడుతోంది.

బాలీవుడ్‌ కేంద్రం

  • బాలీవుడ్‌ పరిశ్రమ ఉన్న ప్రాంతం వాయవ్య ముంబయి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గతంలో ఇక్కడి నుంచి ప్రముఖ నటుడు సునీల్‌ దత్‌ 18ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించారు. సంపన్న ప్రాంతాలతోపాటు మురికివాడలు, ముస్లింల ఆవాస ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. 
  • 2014, 2019లలో ఉమ్మడి శివసేన ఇక్కడ గెలిచింది. ఈసారి ఉద్ధవ్‌ వర్గం నుంచి అమోల్‌ కీర్తికర్, శిందే వర్గం నుంచి రవీంద్ర వైకర్‌ తలపడుతున్నారు. వీరిద్దరూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. 

ధారావి గడ్డ

  • ఆసియాలోనే అతి పెద్ద మురికవాడ ధారావి దక్షిణ మధ్య ముంబయి నియోజకవర్గంలోనే ఉంది. ఎన్నికల్లో ఇక్కడి ప్రజలే ఫలితాలను ప్రభావితం చేస్తారు. ఎస్సీలకు ఈ నియోజకవర్గం రిజర్వు అయింది. 
  • 2014, 2019లలో శివసేన గెలిచింది. ఈసారి శిందే సేన నుంచి సిటింగ్‌ ఎంపీ రాహుల్‌ శెవాలే, ఉద్ధవ్‌ సేన నుంచి అనిల్‌ దేశాయ్‌ పోటీ చేస్తున్నారు. శెవాలే సిటింగ్‌ ఎంపీకాగా.. దేశాయ్‌ రాజ్యసభ సభ్యుడు. ఉద్ధవ్, శిందే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీట్లలో ఇది ఒకటి. 

డంప్‌యార్డుల కష్టం

  • ఈశాన్య ముంబయి నియోజకవర్గంలో ఉన్న రెండు డంపింగ్‌ యార్డుల సమస్య ఈ ఎన్నికల్లో కీలక అంశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ 46శాతం మరాఠీ ప్రజలు ఉంటారు. 17శాతం ముస్లింలు ఉన్నారు. గుజరాతీలూ అధికంగానే ఉంటారు. కాలుష్యం ఇక్కడ అతి పెద్ద సమస్య. 
  • 2019లో ఇక్కడి నుంచి భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి మిహిర్‌ చంద్రకాంత్‌ కొటెఖా, ఉద్ధవ్‌ వర్గం నుంచి సంజయ్‌ దినా పాటిల్‌ పోటీ చేస్తున్నారు. భాజపా, శివసేన విడిపోయిన నేపథ్యంలో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

సర్వమత సమ్మేళనం

  • అన్ని మతాలకు చెందిన ఓటర్లు, మురికవాడల ప్రజలు అధికంగా ఉండే ఉత్తర మధ్య ముంబయి ఏ ఒక్కరికీ అడ్డా కాదు. విజేతలు మారుతూ వస్తున్నారు. ఇక్కడ ముస్లింలు, మరాఠీ ఓటర్లు అధికంగా ఉంటారు. సల్మాన్, షారూఖ్, తెందుల్కర్‌ వంటి ప్రముఖులు ఇక్కడి ఓటర్లు. 
  • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్‌ నుంచి వర్షా గైక్వాడ్, భాజపా నుంచి న్యాయవాది ఉజ్వల్‌ నికం పోటీ చేస్తున్నారు. వర్షా 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రముఖ దళిత నేత. వివిధ వర్గాల ప్రజలున్న కారణంగా ఇక్కడ కాంగ్రెస్‌కు కొంత అనుకూల వాతావరణం ఉంది. భాజపాకు ఎమ్మెల్యేల బలం ఉంది. 

గేట్‌ వే ఆఫ్‌ ఇండియా

  • గేట్ వే ఆఫ్‌ ఇండియా, స్టాక్‌ మార్కెట్‌ ఉన్న ప్రాంతాలు దక్షిణ ముంబయి నియోజకవర్గంలోకి వస్తాయి. హిందువులు అధికంగా ఉన్న కల్బాదేవి, భులేశ్వర్‌తోపాటు ముస్లింలు అధికంగా ఉండే భిండీ బజార్, మసీదు బండర్‌ ఇక్కడే ఉన్నాయి.  
  • 2014, 2019లలో ఇక్కడి నుంచి శివసేన విజయం సాధించింది. ఈసారి ఉద్ధవ్‌ సేన నుంచి సిటింగ్‌ ఎంపీ అరవింద్‌ సావంత్, శిందే సేన నుంచి యామిని జాదవ్‌ తలపడుతున్నారు. కాంగ్రెస్‌ మద్దతు కారణంగా సావంత్‌ గెలుపుపై ఆశగా ఉన్నారు. భాజపా, ఎంఎన్‌ఎస్‌ల మద్దతుపై యామిని ఆధారపడుతున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని