UBT: ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు టచ్‌లో ఉన్నారు: శిందే శివసేన

ఎన్‌డీఏలోకి ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని శివసేన శిందే వర్గానికి చెందిన ఓ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Published : 09 Jun 2024 14:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  శివసేన (Shiv Sena UBT) ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు తమకు టచ్‌లో ఉన్నారంటూ శిందే వర్గం శనివారం రాత్రి ప్రకటించింది. ఈ విషయాన్ని థానే నుంచి విజయం సాధించిన ఆ వర్గం ఎంపీ నరేష్ మ్హస్కే వెల్లడించారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎంపీలు వస్తే.. అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో.. ఆరుగురు ఎంపీలతో కలిసి ఎన్‌డీఏలో చేరేందుకు యత్నిస్తున్నారని ఆయన వివరించారు. ‘ఆపరేషన్‌ బౌ అండ్‌ యారో’ విజయం సాధిస్తుందని తెలిపారు. ‘‘ఇద్దరు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. ఉద్ధవ్‌ వర్గం ఓట్లు అడిగిన తీరుపై వారు అసంతృప్తి చెందారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు భావించారు. కానీ, అది జరగలేదు. వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కోరుకుంటున్నారు. అందుకే ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు’’ అని నరేష్‌ తెలిపారు.

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో శిందే వర్గం మొత్తం ఏడు ఎంపీ సీట్లను గెలుచుకొంది. మరో వైపు ఉద్ధవ్‌ వర్గం మాత్రం తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఉద్ధవ్‌ వర్గానికి చెందిన సుష్మా అంధారే మాట్లాడుతూ ‘‘జనాల దృష్టిని ఆకర్షించేందుకు నరేష్‌ ఇదంతా చేస్తున్నారు. అపరిపక్వమైన ఈ ప్రకటన ఆయన ఆలోచనా తీరును తెలియజేస్తోంది. అలాంటి వారిని సీరియస్‌గా తీసుకోకూడదు. అతడు ఇప్పుడు ఓ ఎంపీ. అలా ప్రకటించి ఉండకూడదు. పేర్లు ఉంటే వాటిని బహిర్గతం చేయాలి. కేంద్ర మంత్రి పదవులు పొందేందుకు ఆయన ఇలాంటివి చేస్తున్నారు’’ అని తిప్పి కొట్టారు. 

ఉద్ధవ్‌ వర్గానికే చెందిన ఎమ్మెల్సీ సచిన్‌ అహిర్‌ మాట్లాడుతూ ‘‘మా ఎంపీలు పార్టీకి విశ్వాసంగా ఉంటారు. వారంతా శిందే సేన, భాజపాతో పోరాడారు. అలాంటి వారు పార్టీ మారతారని ఎలా అనుకొన్నారు’’ అని వ్యాఖ్యానించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని