Hindi Heartland: హిందీబెల్ట్‌లో నయా గేమ్‌ ఛేంజర్లు..!

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎప్పుడూ కీలక పాత్ర పోషించే హిందీ బెల్టులో కొత్తతరం రాజకీయ త్రయం పరిణతి సాధించి జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పబోతోంది. 

Updated : 05 Jun 2024 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్: 2024 సార్వత్రిక ఎన్నికల్లో హిందీ బెల్ట్‌లోని కీలక రాష్ట్రాలైన బిహార్‌, యూపీలో యువ నేతలు జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో బలపడ్డారు. వీరంతా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి నిలబడిన నేతల వారసులే. తండ్రి వారసత్వం వీరికి లాంఛ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడ్డా.. ఇప్పటివరకు చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు వీరికి జాతీయస్థాయిలో ప్రాధాన్యం తీసుకొచ్చాయి. వారెవరంటే..

వ్యూహం మార్చి.. బాబాయ్‌ను బుజ్జగించి..

ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ కుమారుడు అఖిలేశ్‌ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ.. రాష్ట్రంలో సొంతంగా 37 స్థానాలను దక్కించుకొన్నారు. ఫలితంగా ఇక్కడ ఎన్‌డీఏ సీట్ల సంఖ్య 62 నుంచి 33కు పడిపోయింది. ఈ సీట్లతో ఇండియా కూటమిలో అత్యధిక స్థానాలు సాధించిన రెండో పార్టీగా నిలిచింది. 

గతంలో ములాయం జీవించి ఉన్నప్పుడు అఖిలేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  2017లో సొంత బాబాయ్‌ శివ్‌పాల్‌ యాదవ్‌ నుంచి తిరుగుబాటును ఎదుర్కొన్నారు. ఫలితంగా పార్టీ ఓట్లు చీలి కీలక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2022 ఎన్నికల ముందు శివ్‌పాల్‌ను ఎట్టకేలకు పార్టీలోకి తీసుకొచ్చిన ఆ ఏడాదే ములాయం మరణించారు. ఆ తర్వాత వచ్చిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 37 చోట్ల విజయాలు నమోదు చేసి పార్లమెంట్‌లో పార్టీని మూడో స్థానంలో నిలబెట్టారు. ఇండియా కూటమిలో ఇప్పుడు సమాజ్‌వాదినే రెండో అతిపెద్ద భాగస్వామి. ఫలితంగా తమది ఇక ఏమాత్రం ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ కాదని రుజువు చేసుకొన్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించనున్నారు.

తేజస్వీకి దూకుడెక్కువ..

ఇండియా కూటమికి హిందీ రాష్ట్రం బిహార్‌లో అండగా నిలిచిన నాయకుడు తేజస్వీ యాదవ్‌. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ జైలుకెళ్లడం, అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని ఇప్పుడు తేజస్వీనే నడిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన సీట్లు తీసుకొచ్చి రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. కానీ, నీతీశ్‌కుమార్‌ ఎన్‌డీఏలో చేరడంతో ఆ పదవిని కోల్పోయారు. ఇండియా కూటమిలో చేరి.. బలంగా పోరాడారు. ఈసారి వెన్నెముక గాయంతో బాధపడుతున్నా.. వీల్‌ఛైర్‌లో ఉండే ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి, మిత్రపక్షాలకు కలిపి ఈసారి 9 సీట్లు తీసుకురావడంలో విజయం సాధించారు. ఇప్పుడు ఇండియా కూటమిలో తేజస్వీది కీలక పాత్రగా మారింది.

మోదీ నమ్మినబంటుగా చిరాగ్‌   

బిహార్‌ నుంచే జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకంగా మారిన మరో నేత లోక్‌జన శక్తి అధినాయకుడు చిరాగ్‌ పాసవాన్‌. తండ్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ నీడన రాజకీయాలు మొదలుపెట్టారు. కానీ, తండ్రి 2020లో మరణించారు. అదే సమయంలో పార్టీ విషయంలో తన బాబాయ్‌ పశుపతి కుమార్‌ పారస్‌తో విభేదాలు రావడంతో భాజపా ఇద్దరికీ సమదూరం పాటించింది. ఈ సమయంలో తన రాజకీయ అస్థిత్వం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. బిహార్‌ ఫస్ట్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. అతడి నిరీక్షణ ఫలించింది. ఎన్నికల ముందు భాజపా చిరాగ్‌ పక్షం వహించాలని నిర్ణయించింది. ఆయన నేతృత్వంలోని ఎల్‌జేపీకి 5 ఎంపీ స్థానాలను కేటాయించింది. చిరాగ్‌ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా ఐదుచోట్ల విజయం సాధించారు. ఇప్పుడు భాజపా మ్యాజిక్‌ మార్కును అందుకోవడంతో.. ఎన్‌డీఏలో కీలకంగా మారారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు