Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?

2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్‌ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్‌కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.

Updated : 04 Dec 2023 10:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిని చూస్తే.. కమలం జోరు స్పష్టంగా కనిపించింది. ఒక్క తెలంగాణ మినహా మిగిలిన మూడు కీలక రాష్ట్రాల్లో ఆ పార్టీ గాలే వీచింది. వాస్తవానికి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కానీ, 2020లో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటంతో మధ్యప్రదేశ్‌లో అధికారం భాజపా హస్తగతమైంది.

వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్‌ బలమైన పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఏకపక్షంగా మారిపోయింది. మోదీ హవాతో ఈ రాష్ట్రాల్లో ఎన్‌డీఏకు స్పష్టమైన మెజార్టీ లభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 లోక్‌సభ స్థానాల్లో 9 చోట్ల విజయం సాధించింది. ఇక మధ్యప్రదేశ్‌లో 29 స్థానాలకు గాను 28 చోట్ల..  రాజస్థాన్‌లోని మొత్తం 25 సీట్లను ఎన్‌డీఏ దక్కించుకొంది. ఇక బలహీనంగా ఉన్న తెలంగాణలో కూడా భాజపా ఆ ఎన్నికల్లో 4 స్థానాలను సాధించడం విశేషం.

సెమీ ఫైనల్స్‌లో వికసించిన కమలం..

ఇప్పుడు తాజాగా వెలువడిన అసెంబ్లీ ఫలితాలు హస్తం పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భాజపా గణనీయంగా పుంజుకుంది. 

  • మధ్యప్రదేశ్‌లో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 54 అసెంబ్లీ స్థానాలు కాషాయం పార్టీకి అధికంగా లభించాయి. ఇక్కడ హస్తం పార్టీ 48 సీట్లను కోల్పోయింది.
  • రాజస్థాన్‌లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమే పునరావృతమైంది. ఈ సారి భాజపాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. 2018తో పోలిస్తే ఇక్కడ భాజపా సీట్ల సంఖ్య 42కు పెరిగింది. ఆ మేరకు కాంగ్రెస్‌ 30సీట్లకు కోతపడింది. ఇక్కడ బీఎస్పీ, ఇతరుల సీట్లను కూడా కమలం పార్టీ లాక్కొంది. 
  • ఇక ఛత్తీస్‌గఢ్‌లో భాజపా ఊహించని స్థాయిలో పుంజుకుంది. ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ పాలనపై సర్వేల్లో పెద్దగా వ్యతిరేకత లేదని భావించినా.. ఓటర్లు మాత్రం కమలం పార్టీకి అంచనాలకు మించి గతంలో కంటే 39 స్థానాలు అధికంగా ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఏకంగా 33 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కోల్పోయింది.
  • ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ హవా ఉన్నా.. భాజపా కూడా బాగానే పుంజుకొంది. 2018 ఎన్నికల తర్వాత పార్టీ క్రమం తప్పకుండా బలపడుతూ వస్తోంది. 2018లో గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ మాత్రమే కమలం ఎమ్మెల్యేగా ఉండగా.. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ సారి ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించింది.

హస్తంలో లోక్‌సభ టెన్షన్‌.. తెలంగాణపైనే ఆశలు..!

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు వచ్చిందన్న సంతోషం కంటే.. మూడు కీలక రాష్ట్రాల్లో దెబ్బతిన్నామన్న విషయం హస్తం నేతలను భయపెడుతోంది. తెలంగాణ మినహా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 62 సీట్లలో ఎన్‌డీఏ పక్షం విజయం సాధించింది. కానీ, 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ఎన్‌డీఏకు బలమైన పోటీ ఉంటుందని అంచనాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం హవా ఉన్న సమయంలోనే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ ఇక్కడ దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సారి ఏకంగా అసెంబ్లీలలో కూడా భాజపానే పాగా వేయడంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌, ఇండియా కూటమి మరింత శ్రమించాల్సిన అవసరం ఉంటుంది.

ఇక తెలంగాణలో కూడా భాజపా అసెంబ్లీ స్థానాలు పుంజుకున్నా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇక్కడి లోక్‌సభ స్థానాలు హస్తం పార్టీలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కేవలం 3 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌.. 2024లో పుంజుకొని మరికొన్నింటిని తన ఖాతాలో వేసుకొంటే మాత్రం మొత్తం మీద లాభపడినట్లవుతుంది.

నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 82 లోక్‌సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో కేవలం 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. వాటిల్లో మూడు తెలంగాణలోనే ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో గత పరిస్థితే పునరావృతమైనా.. తెలంగాణలో సీట్లు పెరిగితే మాత్రం హస్తం పార్టీకి లబ్ధి చేకూరినట్లే. కానీ ఇది ఎన్‌డీఏ నుంచి అధికారం చేజిక్కించుకునే స్థాయిలో మాత్రం ఉపయోగపడకపోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని