Lok Sabha elections: ఐదో విడతలో 59% పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ కింద ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగులో 59% మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

Published : 21 May 2024 04:55 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ కింద ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగులో 59% మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఓటు వేసినవారిలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ; ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్‌ టాటా, అనిల్‌ అంబానీ; క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్, బాలీవుడ్‌ ప్రముఖులు- అక్షయ్‌ కుమార్, అనిల్‌ కపూర్, షబానా అజ్మీ, పరేశ్‌ రావల్, జాన్వీ కపూర్, అనుపమ్‌ ఖేర్, రాజ్‌కుమార్‌ రావ్, జావేద్‌ అఖ్తర్, షాహిద్‌ కపూర్‌ తదితరులు ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో కొన్ని చెదురుమదురు సంఘటనలు, మరికొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. వివిధ అంశాలపై ఈసీకి వెయ్యికి పైగా ఫిర్యాదులు అందాయి. ఈ దశతో కలిపి 428 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. 

బెంగాల్‌లో ఎక్కువ 

ఈ దశలో బెంగాల్‌లో అత్యధికంగా 73.14% పోలింగ్‌ నమోదైంది. బేరక్‌పుర్, ఆరాంబాగ్, బనగావ్‌ తదితర చోట్ల తృణమూల్, భాజపా కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. కేంద్ర బలగాలు భాజపా కార్యకర్తలకు సహకరిస్తున్నాయని, ఓటర్లను బెదిరిస్తున్నాయని తృణమూల్‌ కార్యకర్తలు కొన్నిచోట్ల నిరసనలు తెలిపారు. బిహార్‌లో 53.78, మహారాష్ట్రలో 54.22, జమ్మూకశ్మీర్‌లో 54.21, ఝార్ఖండ్‌లో 63.06, ఒడిశాలో 61.24, యూపీలో 57.79, కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో 68.47 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రాథమిక అంచనాల్లో తేలింది. లద్దాఖ్‌ పరిధిలోని కార్గిల్‌లో 71.45% మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి కూడా పలు రాష్ట్రాల్లో ఓటర్లు బారులుతీరి ఉండడంతో తుది లెక్కలు మంగళవారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో 59% పైగా పోలింగ్‌ నమోదైంది. చివరిసారిగా 1984లో అక్కడ 58.90% పోలింగ్‌ జరిగింది. లద్దాఖ్‌లో 68.47% పోలింగ్‌ జరిగింది. ఈ రెండు చోట్లా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. కార్గిల్‌లో 74% నమోదైంది.

  • యూపీలోని రాహీ బ్లాకులో కొన్నిచోట్ల ఓటర్లను భాజపా అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అమేఠీలో 54.17% పోలింగ్‌ నమోదైంది.  
  • మహారాష్ట్రలో పోలింగ్‌ కేంద్రాల వెలుపల సదుపాయాలపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శలు చేశారు. కనీసం నీడనైనా కల్పించలేకపోయారని తప్పుబట్టారు. ముంబయిలో పోలింగ్‌ ఆలస్యంగా కొనసాగడంపై విమర్శలు వచ్చాయి. అర్బన్‌ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్‌ (52.27%) నమోదైంది.
  • ఒడిశాలోని బరగఢ్‌ జిల్లా సర్సారాలో ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలిస్తున్నందుకు ఓ ఆటో డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగి హతమార్చారు. ఒడిశాలో 35 శాసనసభ నియోజకవర్గాలకూ ఎన్నికలు జరిగాయి. 
  • ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ నియోజకవర్గంలోని ఓ గ్రామ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తమ దీర్ఘకాల డిమాండ్‌ అయిన వంతెనను నిర్మించకపోవడంతో వారు ఓటు వేయడానికి వెళ్లకుండా నిరసన తెలిపారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు