Odisha: గెలుపు తీరం చేరేదెవరు?

ఒడిశాలోని తీర ప్రాంత నియోజకవర్గాల్లో బిజూ జనతాదళ్‌ (బిజద), భాజపాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ బరిలో ఉన్నా గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది.

Updated : 25 May 2024 05:36 IST

బిజద, భాజపా హోరాహోరీ
ఒడిశాలో 6 స్థానాలకు నేడే పోలింగ్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశాలోని తీర ప్రాంత నియోజకవర్గాల్లో బిజూ జనతాదళ్‌ (బిజద), భాజపాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ బరిలో ఉన్నా గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఒడిశాలోని భువనేశ్వర్, పూరీ, కటక్, ఢెంకనాల్, సంబల్‌పుర్, కేంఝర్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో శనివారం పోలింగ్‌ జరగనుంది. ఈ విడతలో ఉద్ధండులు బరిలో ఉన్నారు. ఈ 6 లోక్‌సభ స్థానాల్లో 64 మంది బరిలో ఉన్నారు. 

జగన్నాథుడి కొలువు

జగన్నాథుడి కొలువైన పూరీ నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతం ఆర్థికంగా బలంగా కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో 15.5% ఎస్సీలున్నారు. 83శాతం గ్రామాల్లో నివసిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద వంట గది ఇక్కడ ఉంది. ఎకరా విస్తీర్ణంలో ఉండే 752 స్టవ్‌లతో మహా ప్రసాదాన్ని తయారు చేస్తారు. 

2014, 2019లలో బిజద విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆశిస్తున్న భాజపా సంబిత్‌ పాత్రను మరోసారి బరిలో దింపింది. పురీ వాసి అయిన ఆయన ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ముంబయి పోలీస్‌ కమిషనరుగా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరూప్‌ పట్నాయక్‌ బిజద నుంచి పోటీ చేస్తున్నారు. సంబిత్, అరూప్‌ల మధ్య పోటీ నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి జయ నారాయణ పట్నాయక్‌ పోటీ నామమాత్రమే.


ఆలయాల నగరి

ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో 700 ఆలయాలున్నాయి. అందుకే దీనిని టెంపుల్‌ సిటీగా పిలుస్తారు. అంతే కాదు.. ఇది విద్యా కేంద్రంగా సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా ఉంది. ఈ నియోజకవర్గంలో సగం జనాభా పట్టణ ప్రాంతంలోనే ఉంటారు. ఎస్సీలు 13% ఉన్నారు. 

2014లో బిజద, 2019లో భాజపా విజయం సాధించాయి. గత ఎన్నికల్లో గెలిచిన మాజీ ఐఏఎస్‌ అధికారిణి అపరాజిత సారంగీ మరోసారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. ప్రైవేటు విమాన సంస్థలో పైలట్‌గా విధులు నిర్వహించి ఇటీవల ఉద్యోగం వదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన మన్మధ్‌ రౌత్రాయిని బిజద నిలబెట్టింది. మైనారిటీ కార్డు ప్రయోగించిన కాంగ్రెస్‌ యాసిర్‌ నవాజ్‌ను బరిలోకి దింపింది. పోటీలో ముగ్గురున్నా ప్రధాన పోటీ అపరాజిత, మన్మధ్‌ల మధ్యే ఉంది. 


పురాతన నగరం

క్రీస్తు శకం 941వ సంవత్సరంలో కటక్‌ ఏర్పాటైందని చరిత్ర చెబుతోంది. మహానది ప్రాంతంలో ఈ నగరం ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్‌ చంద్ర బోస్‌ కటక్‌లోనే జన్మించారు. 

1998, 1999, 2004, 2009, 2014, 2019లలో దిగ్గజ నేత భర్తృహరి మెహతాబ్‌ ఈ నియోజకవర్గం నుంచి బిజద తరఫున గెలిచారు. అయితే ఇటీవలే ఆయన భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. పారిశ్రామిక రంగంలో కీలక బాధ్యతల్లో 3 దశాబ్దాలపాటు విధులు నిర్వహించిన సంతృప్త మిశ్ర బిజద తరఫున పోటీ చేస్తున్నారు. ఒడిశా నుంచి వెలువడుతున్న ప్రముఖ ఒడియా దినపత్రిక ప్రజాతంత్రకు భర్తృహరి ప్రధాన సంపాదకుడు. కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న సురేష్‌ మహాపాత్ర పోటీ నామమాత్రం. 


చీరలకు ప్రసిద్ధి

సంబల్‌పురీ చీరలకు సంబల్‌పుర్‌ ప్రసిద్ధి. గతంలో ఇక్కడి నుంచి వజ్రాలను ఎగుమతి చేసేవారు. అతి పొడవైన హీరాకుండ్‌ డ్యాం ఇక్కడే ఉంది. 1998 నుంచీ ఇది బిజదకు కంచుకోట. 81% ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. 30% ఎస్టీలు, 17.9% ఎస్సీలున్నారు. 

2014లో బిజద, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విధేయ గణంలో అగ్ర గణ్యుడు, బిజద పార్టీ సిద్ధాంతకర్త ప్రణవ ప్రకాష్‌దాస్‌ (బొబి) ధర్మేంద్రకు సవాల్‌ విసురుతున్నారు. బొబి విజయం కోసం పలువురు బిజద నేతలు సంబల్‌పూర్‌లో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ధర్మేంద్ర విజయం కోసం కేంద్ర మంత్రులు, భాజపా శ్రేణులు కృషి చేస్తున్నాయి. 


వెనుకబడిన ప్రాంతం

84 శాతం ప్రజలు గ్రామాల్లో ఉండే ఢెంకనాల్‌ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఎస్టీలు 13.6%, ఎస్సీలు 19.2% ఉంటారు. గిరిజనులు, పేదలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వీలుగా  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ను ఢెంకనాల్‌లో కేంద్రం ఏర్పాటు చేసింది. 

2014, 2019లలో బిజద విజయం సాధించింది. ఎమర్జెన్సీ సమయంలో కారాగారంలో ఉన్న భాజపా నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు రుద్ర నారాయణ పాణి 2019 ఎన్నికల్లో ఢెంకనాల్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసి స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనే బరిలోకి దిగారు. బిజద నుంచి అవినాష్‌ సామల్‌ అనే యువకుడు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు సస్మిత్‌ బెహరా రంగంలోకి దిగారు. రాజకీయ అనుభవం, వ్యూహరచనల్లో దిట్టగా పేరున్న రుద్ర నారాయణ పాణిపై బిజద, కాంగ్రెస్‌ల నుంచి అంతగా రాజకీయ అనుభవం లేనివారు పోటీ చేస్తున్నారు. 


గిరిజనుల ప్రాబల్యం

దాదాపు సగం మంది గిరిజనులుండే కేంఝర్‌లో 87శాతం గ్రామాల్లో నివసిస్తారు. 10.8శాతం ఎస్సీలున్న ఈ నియోజకవర్గంలో బిజదదే ఆధిపత్యం. ఇక్కడ ఖనిజాలు అపారం. అయినా అభివృద్ధి, మౌలిక సౌకర్యాల్లో తీసికట్టుగానే ఉంది. 

2014, 2019లలో బిజద గెలిచింది. ఈసారి ఆ పార్టీ నుంచి నవీన్‌ ధనుర్జయ సిద్ధు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన అనంత నాయక్‌ను భాజపా మళ్లీ అభ్యర్థిగా చేసింది. కాంగ్రెస్‌ బినోధ్‌ బిహారీ నాయక్‌ను నిలబెట్టింది. ధనుర్జయ, అనంతల మధ్యే ముఖాముఖి పోరు కనిపిస్తోంది.


అసెంబ్లీ ఎన్నికల్లో తేలనున్న మంత్రుల జాతకాలు 

ఈ విడతలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్, ప్రఫుల్ల మల్లిక్,  అశోక్‌చంద్ర పండా, తుషార కాంతి బెహరా, విపక్ష నేత జయనారాయణ మిశ్ర, బిజద ఉపాధ్యక్షులు దేవీప్రసాద్‌ మిశ్ర, ప్రసన్న ఆచార్యల భవితవ్యం తేలనుంది. మరోవైపు 5 సార్లు రాష్ట్రాన్ని పాలించిన నవీన్‌పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి పాలనా పగ్గాలు తమ సొంతం అవుతాయని అంటున్న భాజపా అగ్ర నేతలంతా ఒడిశాలో ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రులు, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, అస్సాం ముఖ్యమంత్రులు   రాష్ట్రానికి వరుస కడుతున్నారు. వయోభారంవల్ల నవీన్‌ మునుపటి మాదిరి ప్రచారం చేయలేకపోతున్నారు. ఆయన ప్రతినిధిగా వి.కార్తికేయ పాండ్యన్‌ పాల్గొంటున్నారు. 


ఎక్కడ ఎంత మంది పోటీ?

  • పూరీ: 7 
  • భువనేశ్వర్‌: 12
  • కటక్‌: 10 
  • సంబల్‌పుర్‌: 14
  • ఢెంకనాల్‌: 10 
  • కేంఝర్‌: 11
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు