LS Polls 6th Phase: ఆరోవిడతలో 61.11%.. 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక దశ ప్రశాంతంగా ముగిసింది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఓటింగ్‌ పూర్తయింది. మొత్తంగా వీటిలో 61.11% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Updated : 26 May 2024 06:44 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక దశ ప్రశాంతంగా ముగిసింది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఓటింగ్‌ పూర్తయింది. మొత్తంగా వీటిలో 61.11% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 79.40%, అత్యల్పంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 54.03% పోలింగ్‌ నమోదైంది. అయితే ఇవి తాత్కాలిక గణాంకాలేనని, పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ విడతతో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. చివరిదైన ఏడో దశలో భాగంగా 57 నియోజకవర్గాల్లో వచ్చే నెల 1న ఓటింగ్‌ జరగనుంది. దిల్లీ, హరియాణాల్లోని అన్ని స్థానాలకు శనివారమే పోలింగ్‌ పూర్తయింది. దిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయి. 

ఈవీఎం మొరాయింపుపై బృందా కారాట్‌ ఆగ్రహం 

న్యూదిల్లీ స్థానం పరిధిలోని సెయింట్‌ కొలంబియా పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ ఓటు వేశారు. అయితే తాను వచ్చేసరికి అక్కడ ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ బ్యాటరీలో ఛార్జింగ్‌ అయిపోయిందని, ఫలితంగా దాదాపు 50 నిమిషాలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకే ఛార్జింగ్‌ అయిపోవడం.. ఈసీ ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ కేంద్రంలో కేవలం 15 నిమిషాలపాటే ఈవీఎం మొరాయించిందని ఈసీ తెలిపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్, సీపీఐ నేత అన్నీ రాజా తదితరులు దిల్లీలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

బెంగాల్‌లో ఘర్షణలు

బెంగాల్‌లో జంగల్‌ మహల్‌ ప్రాంతంలోని 8 సీట్లకు ఈ దశలో ఓటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పరస్పరం దాడులు, ఫిర్యాదులు చేసుకున్నారు. కేంద్ర బలగాలు తమ మద్దతుదారులపై దాడి చేశాయని కాంథీ లోక్‌సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి సౌమేందు అధికారి ఆరోపించారు. ఆ స్థానం పరిధిలో కమలదళం కార్యకర్తలు నిరసనలకు దిగారు. మిడ్నాపోర్‌లో భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను ‘గో బ్యాక్‌’ అంటూ తృణమూల్‌ కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. ఫలితంగా భాజపా, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టాయి. పశ్చిమ మిడ్నాపోర్‌ జిల్లాలోని గార్బెటా ప్రాంతంలో తృణమూల్‌ కార్యకర్తలు తన వాహనశ్రేణిపై ఇటుకలతో దాడి చేశారని ఝార్‌గ్రామ్‌ భాజపా అభ్యర్థి ప్రణత్‌ టుడూ ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు గాయపడ్డారని పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లా టుండీలో ఈ దఫా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వకపోవడం ఇదే తొలిసారి. 

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌-రాజౌరీ జిల్లాలో గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూలేనంత ఎక్కువగా ఓటింగ్‌ నమోదైందని ఈసీ తెలిపింది. తమ పార్టీ కార్యకర్తలను, పోలింగ్‌ ఏజెంట్లను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, అనంతనాగ్‌-రాజౌరీ అభ్యర్థి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరా పోలీసు స్టేషన్‌ వెలుపల శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై ఆమె బైఠాయించి ధర్నా నిర్వహించారు. 


తరలివచ్చిన ప్రముఖులు

ఆరో విడతలో భాగంగా న్యూదిల్లీ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌ సముదాయంలోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయంలో.. పూర్తిగా మహిళా సిబ్బందితో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో వరుసలో వచ్చి ఆమె ఓటు వేశారు. దిల్లీ నార్త్‌ ఎవెన్యూలోని సీపీడబ్ల్యూడీ సేవా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్‌స్టేషన్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమవంతు వచ్చేదాకా వారిద్దరూ వరుసలో నిలబడి వేచిచూశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాదాస్, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ తదితర ప్రముఖులు కూడా దిల్లీలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. దిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చాందినీచౌక్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబంతో సహా ఓటు వేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా తన భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రేహాన్, కుమార్తె మిరాయాలతో కలిసి వచ్చి.. న్యూదిల్లీ నియోజకవర్గం పరిధిలో లోధీ రోడ్డులోని ఓ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. 


ఒడిశాలో పోలింగ్‌ ప్రశాంతం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే శనివారం ఒడిశాలో మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పూరీ, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, సంబల్‌పూర్, కేంఝర్‌ లోక్‌సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల అయిదేళ్ల రాజకీయ భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. హిందోళ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని 136వ పోలింగ్‌ బూత్‌ ఏజెంటు శుకదేవ్‌ పట్నాయక్‌ (35) స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన మృతిచెందాడు. ఖండపడ నియోజకవర్గంలోని 167వ నెంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటేయడానికి వచ్చిన 60 ఏళ్ల వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు