AAP: ఏంటీ అరాచకం.. పార్టీ కేంద్ర కార్యాలయానికి తాళం వేస్తారా?: ఆప్‌ నేతలు

దిల్లీలోని ఆప్‌ ప్రధాన కార్యాలయాన్ని కేంద్రం అక్రమంగా మూసివేయించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి ఆతిశీ వెల్లడించారు.

Updated : 23 Mar 2024 17:18 IST

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టయినప్పటి నుంచి దేశ రాజధానిలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా.. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మూసి వేయించిందని ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ పార్టీ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆప్‌ మంత్రి ఆతిశీ (Atishi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం అరాచకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

కేంద్రం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగం నిర్దేశించిన హద్దులు దాటి ప్రవర్తించడమేనని ఆతిశీ మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అనుమతి కోరామని, నేరుగా వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఐటీవోలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు అన్ని మార్గాలను కేంద్ర ప్రభుత్వం మూసివేయించిందని మరో ఆప్‌ మంత్రి సౌరవ్‌ భరద్వాజ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడం నిరంకుశత్వమేనని దుయ్యబట్టారు. 

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని ఐటీఓ సమీపంలోని ఆప్‌ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు శుక్రవారం మూసివేశారు. ఇక్కడికి సమీపంలోనే భాజపా కార్యాలయం ఉంది. కేజ్రీవాల్‌ అరెస్టుపై నిరసన తెలిపేందుకు ఆప్‌ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని