NCP: సహాయ మంత్రి పదవిని తిరస్కరించిన ఎన్సీపీ

స్వతంత్ర హోదాతో భాజపా ఇస్తామని చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పదవిని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ సున్నితంగా తిరస్కరించారు. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 10 Jun 2024 06:45 IST

 కేబినెట్‌ హోదా కోసం  వేచిచూడాలన్న భాజపా

దిల్లీ: స్వతంత్ర హోదాతో భాజపా ఇస్తామని చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పదవిని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ సున్నితంగా తిరస్కరించారు. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలోనే తాను కేబినెట్‌ మంత్రిగా పనిచేశాననీ, ఇప్పుడు సహాయ మంత్రి అంటే తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని భాజపా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా.. కొద్దిరోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. పటేల్‌ నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు రావడంతో.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఫడణవీస్, కమలం నేత వినోద్‌ తావ్‌డే ఆయన్ను కలిశారు. అనంతరం ఫడణవీస్‌ మాట్లాడుతూ పొత్తు ధర్మం ప్రకారం మిత్ర పక్షాలకు పార్లమెంట్‌లో బలం ఆధారంగా మంత్రిత్వ శాఖల కేటాయింపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో విస్తరణ జరిగినప్పుడు అవకాశం ఉంటుందనీ, అప్పటివరకు వేచిచూడాలని పటేల్‌ను అభ్యర్థించామన్నారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి లోక్‌సభలో ఒకరు, రాజ్యసభలో మరో సభ్యుడు ఉన్నారు. ఈ క్రమంలో తాము ఎన్డీయేను బలపరుస్తున్నామని పవార్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు