సతీమణిపై సోదరి విజయం.. అజిత్‌ ఏమన్నారంటే..?

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌సీపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అందుకు పూర్తి బాధ్యత అజిత్ పవారే(Ajit Pawar) తీసుకున్నారు. 

Published : 07 Jun 2024 19:30 IST

ముంబయి: మహారాష్ర్టలో అధికార కూటమిలో భాగమైన ఎన్‌సీపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. దీనికి తనదే పూర్తి బాధ్యత అని ఎన్‌సీపీ చీఫ్ అజిత్‌పవార్ (Ajit Pawar) వెల్లడించారు. అలాగే బారామతి ఫలితం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. అంతేగాకుండా కొందరు నేతలు శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలోకి తిరిగి వెళ్లనున్నారంటూ వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు.

‘‘ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయి. నాకు ప్రజల మద్దతు ఉంది. నా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాతో ఉంటానని హామీ ఇచ్చారు’’ అని అజిత్ వెల్లడించారు. అలాగే బారామతి ఫలితంపై మాట్లాడుతూ.. ‘‘అక్కడి ప్రజల మద్దతు ఎప్పుడూ నాకే ఉన్నప్పటికీ.. ఈ రిజల్ట్స్ ఆశ్చర్యపర్చాయి’’ అని బదులిచ్చారు. ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌తో చేతులు కలుపుతారా అని అడగ్గా.. ఎన్నికల ఓటమికి తనదే బాధ్యత అని చెప్పారు. అలాగే కుటుంబ విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదన్నారు.

గత ఏడాది అజిత్‌ పవార్‌ ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య పక్షంగా చేరిన సంగతి తెలిసిందే. దాదాపు 40మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు అజిత్‌ క్యాంపులో చేరి శరద్‌పవార్‌కు పెద్ద దెబ్బే కొట్టారు. ఈ క్రమంలోనే స్వయంగా చెల్లి వరుసైన శరద్‌ పవార్‌ కూతురు సుప్రియా సూలేపై, తన సతీమణి సునేత్రాను బారామతిలో బరిలోకి దింపారు. ఈ పరిణామాల మధ్య సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అజిత్ వర్గాన్ని నిరాశపరిచాయి. ఐదు స్థానాల్లో పోటీ చేసి ఒక సీటును మాత్రమే పొందారు. సుప్రియ చేతిలో సునేత్ర ఓడిపోవడం గమనార్హం. ఎన్సీపీ (ఎస్పీ) 10 స్థానాల్లో పోటీ చేసి ఎనిమిదింటిలో గెలుపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని