TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించనున్నారు.

Updated : 08 Dec 2023 16:16 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అక్బరుద్దీన్‌ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనసభ తొలి సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. 

ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. భారాసకు చెందిన ఇతర సభ్యుల్లో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరుసార్లు ఎన్నికైన శాసనసభ్యులు. కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇద్దరూ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని