Akhilesh Yadav: అఖిలేశ్‌.. మీకేమైనా మతిపోయిందా?: కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ఫైర్‌

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌(Akhlesh Yadav) ఇచ్చిన ‘సీఎం ఆఫర్‌’పై భాజపా సీనియర్‌ నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య(Keshav Prasad Maurya) స్పందించారు.

Published : 03 Dec 2022 01:14 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌(Akhlesh Yadav) ఇచ్చిన ‘సీఎం ఆఫర్‌’పై భాజపా సీనియర్‌ నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య(Keshav Prasad Maurya) స్పందించారు. అఖిలేశ్‌ సీఎం కాలేరు.. ఎవరినీ ముఖ్యమంత్రిని చేయలేరంటూ ఘాటుగా విమర్శించారు. రామ్‌పూర్‌లో నిన్న జరిగిన ఎన్నికల ర్యాలీలో అఖిలేశ్‌ మాట్లాడుతూ.. యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రిజేశ్‌ పాఠక్‌లు సీఎం పదవి కావాలనుకొంటున్నారని ఆరోపించారు. వాళ్లిద్దరూ 100 మంది భాజపా ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలో చేరితే సీఎం పదవి ఆఫర్‌ చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ‘‘చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ని కూడా బదిలీ చేయించలేనప్పుడు ఇక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి లాభమేంటి? మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. మీరు సీఎం కావొచ్చు’’ అని అఖిలేశ్‌ సీఎం పదవిని ఆఫర్‌ చేశారు.  దీనిపై కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ట్విటర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు.

‘‘అఖిలేశ్‌ యాదవ్‌.. మీరు సీఎం కాలేరు.. వేరెవరినీ ముఖ్యమంత్రిని చేయలేరు.  మెయిన్‌పురి లోక్‌సభ, రాంపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోతుందన్న భయంతో చిరాకుపడటమే కాకుండా మానసిక సమతుల్యత కూడా కోల్పోయారని మీ మాటలను బట్టి అర్థమవుతోంది’’ అని కౌంటర్‌ ఇచ్చారు. అలాగే, ప్రజలు సమాజ్‌వాదీ పార్టీని తిరస్కరించారంటూనే ఆ పార్టీని ‘సమాప్త్‌వాదీ పార్టీ’గా మౌర్య అభివర్ణించారు. ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ సీటు ఖాళీ కావడంతో అక్కడ జరగనున్న ఉప ఎన్నికల్లో అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మెయిన్‌పురితో పాటు రాంపూర్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఈ నెల 5న ఉప ఎన్నిక జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని