Akhilesh Yadavs: ఇది పీడీఏ విజయం: అఖిలేశ్‌ యాదవ్‌

యూపీలో అధికార భాజపాకు ఎన్నికల్లో షాక్‌ ఇచ్చిన తర్వాత తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ స్పందించారు. 

Published : 05 Jun 2024 13:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తొలిసారి స్పందించారు. తమ పార్టీకి అండగా నిలిచిన పీడీఏ వర్గం శక్తిగా ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. వెనకబడిన తరగతులు, మైనార్టీలు, దళితుల విజయంగా అభివర్ణించారు. సమష్టి కృషితో రాష్ట్రంలో పార్టీని ముందుకుతీసుకెళ్లి విజయం సాధించామన్నారు.

‘‘రాష్ట్రంలో ఇండియా కూటమి ఫలితాలు వెనకబడిన, మైనార్టీ, గిరిజన, మహిళలు, అగ్రవర్ణ పేద వర్గాలతో కలిసి దళిత-బహుజన కూటమి సాధించిన విజయం. అందరికీ సమానహక్కులు, గౌరవం, రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీరంతా భుజాలు కలిపి పోరాడారు. తాజా విజయంతో ఈ వర్గాల కూటమి మరింత బలోపేతం అవుతుంది. ప్రతీ వర్గంలో మంచివారంతా కలిసి విజయానికి సహకరించారు’’ అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఈసారి ఎస్పీ గణనీయంగా బలపడటంతో భాజపా తీవ్రంగా దెబ్బతింది. సగానికి పైగా సీట్లు సమాజ్‌వాదీ ఖాతాలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌ వంటి ప్రముఖులు కూడా ఓటమి పాలయ్యారు. వీరితోపాటు కేంద్ర మంత్రి అజేయ్‌ మిశ్రా తెని, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ వంటి వారు తమ స్థానాలను కోల్పోయారు. 

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఆశలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నీళ్లు చల్లారు. తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం తర్వాత ఆయన ఎదుర్కొన్న ఈ తొలి సార్వత్రిక ఎన్నికలోనే పార్టీ మెరుగైన పనితీరును కనబర్చింది. దళితులు, ముస్లింలు, ఇతర అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు ఎస్పీకే అండగా నిలిచారు. కన్నౌజ్‌ నుంచి బరిలోకి దిగిన ఆయన, భార్యతోపాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులను గెలిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. ఆయన ప్రసంగాల్లో అధికశాతం కేజ్రీవాల్, హేమంత్‌ సోరెన్‌లను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రజలను ఆలోచనలో పడేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని