ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!

లఖ్‌నవూ, రాయ్‌బరేలీ నుంచి నీరేంద్ర దేవ్‌ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Updated : 18 May 2024 07:21 IST

రాహుల్, రామ మందిరంపై తేలనున్న ఓటర్ల మనోగతం
20న రాయ్‌బరేలీ, ఫైజాబాద్‌లతో సహా 14 నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్‌

లఖ్‌నవూ, రాయ్‌బరేలీ నుంచి నీరేంద్ర దేవ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంటి ప్రముఖులు బరిలో ఉన్నా రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ, అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కంచుకోటను రాహుల్‌ గాంధీ నిలబెట్టుకుంటారా.. ఫైజాబాద్‌లో భాజపాకు అనూహ్య మెజారిటీని కట్టబెడతారా అనేది తేలనుంది. కుల, మత రాజకీయాలు ఇప్పటికీ ప్రాధాన్యాంశాలేనని స్థానికులు అంటున్నారు.

రాహుల్‌ గాంధీ, రాజ్‌నాథ్‌ సింగ్‌


నదుల్లో రక్తచరిత్ర 

  • రైతుల ఉద్యమం సందర్భంగా రాయ్‌బరేలీ సమీపంలోని నదుల్లో రక్తం పారిందని చెబుతుంటారు. స్వాతంత్య్రం వచ్చాక ఫిరోజ్‌ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 1952లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 72 ఏళ్లలో 66 ఏళ్లు కాంగ్రెస్‌ చేతిలోనే ఉంది. 2004 నుంచి ఇప్పటిదాకా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఠాకుర్లు, బ్రాహ్మణులు, కాయస్థలు, వైశ్యులు, పంజాబీలతోపాటు యాదవ్‌లు, కుర్మీలు, మౌర్య కుశ్వాహాలు, లోధ్‌లు ఉంటారు. దళితులూ అధిక సంఖ్యలోనే ఉంటారు.
  • ఈసారి కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, భాజపా నుంచి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ మద్దతు కూడా ఉండటంతో రాహుల్‌ గెలుపుపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. 

కిషోరీలాల్‌ శర్మ, స్మృతి ఇరానీ

గాంధీల కంచుకోట

  • రాజీవ్, సంజయ్, సోనియా, రాహుల్‌ గాంధీలు ప్రాతినిధ్యం వహించిన అమేఠీ కాంగ్రెస్‌కు కంచుకోట. ఒకప్పుడు ఛత్రపతి సాహూజీ మహారాజ్‌ నగర్‌గా ఉండే ఈ జిల్లా పేరును అమేఠీగా మార్చారు. 2019లో అనూహ్యంగా రాహుల్‌ గాంధీని భాజపా నేత స్మృతి ఇరానీ ఓడించారు.
  • ఈసారి కాంగ్రెస్‌ తరఫున గాంధీల నమ్మిన బంటు కిషోరీలాల్‌ శర్మ, భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో తొలిసారిగా అమేఠీ నుంచి గాంధీల కుటుంబం పోటీ చేయడం లేదు. అయితే పోటీ రాహుల్, ఇరానీ మధ్యే ఉందని స్థానికులు భావిస్తున్నారు. 

నవాబుల నగరం

  • నవాబుల నగరంగా పేరొందిన లఖ్‌నవూను రాముడి తమ్ముడు లక్ష్మణుడు కనిపెట్టారని అంటుంటారు. అందుకే దీనిని కొందరు లఖన్‌ పాసీ అని పిలుస్తారు. వాజ్‌పేయీ ఇక్కడి నుంచి 5 సార్లు గెలిచారు. ఇక్కడ ఎస్సీలు 10శాతం, ముస్లింలు 21 శాతం ఉంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు. 
  • 2014, 2019లలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇక్కడి నుంచి గెలిచారు. మరోసారి బరిలోకి దిగారు. ఆయన విజయంపై ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. సమాజ్‌వాదీ నుంచి రవిదాస్‌ మెహ్రోత్రా, బీఎస్పీ నుంచి సర్వర్‌ మాలిక్‌ బరిలో ఉన్నారు.

వీర వనిత నడయాడిన నేల

  • స్వాతంత్య్ర పోరాట యోధురాలు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటీషర్లపై పోరాడిన ఝాన్సీ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ ప్రాంతంలోని బుందేల్‌ఖండ్‌ సాహసాలకు, త్యాగాలకు, ఆత్మ గౌరవానికి మారుపేరు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఈ ప్రాంతంపై ఇటీవలి కాలంలో భాజపా విజయ పతాక ఎగుర వేస్తోంది. ఇక్కడ 66శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. 24శాతం ఎస్సీలుంటారు. యాదవ్‌లు, బ్రాహ్మణులు ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తారు.  
  • 2014లో ఇక్కడి నుంచి ఉమాభారతి గెలిచారు. 2019లో ఆమెకు టికెట్‌ ఇవ్వలేదు. అయినా ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈసారి భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ అనురాగ్‌ శర్మ, కాంగ్రెస్‌ నుంచి ప్రదీప్‌ జైన్‌ ఆదిత్య తలపడుతున్నారు. గతంలో సాధించిన మెజారిటీని నిలబెట్టుకోవాలని భాజపా, పోయిన పట్టును మళ్లీ సాధించాలని సమాజ్‌వాదీ అండతో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. 

రుషీవలుడి పేరుతో..

  • జాల్వాన్‌ అనే రుషి పేరుతో జాలౌన్‌ నగరం ఏర్పాటైంది. హర్షవర్థనుడు పాలించిన ప్రాంతమిది. ఇక్కడ 27.8శాతం ఎస్సీలుంటారు. 78శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. 
  • 2014, 2019లలో భాజపా గెలిచింది. ఈసారి భాజపా నుంచి మూడోసారి భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ, సమాజ్‌వాదీ నుంచి నారాయణ్‌ దాస్‌ అహిర్‌వార్, బీఎస్పీ నుంచి సురేశ్‌ చంద్ర గౌతం పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్‌ కోసం భాను ప్రతాప్‌ ప్రయత్నిస్తున్నారు.  

వస్త్ర మార్కెట్‌

  • 1859లో రాజా కాశీ ప్రసాద్‌ బాజ్‌పేయీ తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన మోహన్‌లాల్‌ గంజ్‌ ప్రముఖ వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆహార ధాన్యాలు, వస్త్రాల వ్యాపార కేంద్రంగా ఇది కొనసాగుతోంది. ఇక్కడ ఎస్సీలు 24శాతం, ముస్లింలు 22 శాతం ఉన్నారు.
  • 2014, 2019లలో భాజపా ఇక్కడి నుంచి గెలిచింది. ఎస్సీలకు కేటాయించిన ఈ నియోజకవర్గంలో ఈసారి భాజపా నుంచి కౌశల్‌ కిషోర్, సమాజ్‌వాదీ తరఫున ఆర్‌కే చౌధరి, బీఎస్పీ టికెట్‌పై రాజేశ్‌ కుమార్‌ బరిలో ఉన్నారు. కౌశల్‌ హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆలయాల ప్రాంతం

యమునా, బేత్వా నదుల మధ్యనున్న హమీర్‌పుర్‌ ప్రాంతంలో పలు ఆలయాలున్నాయి. బుందేల్‌ఖండ్‌లోని నియోజకవర్గమిది. 22.63శాతం ఎస్సీలుంటారు. రాజ్‌పూత్‌లు, మల్లాలు, బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తారు. 2014, 2019లలో భాజపా నేత కున్వర్‌ పుష్పేంద్ర సింగ్‌ గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌ కోసం భాజపా నుంచి కున్వర్, సమాజ్‌వాదీ తరఫున అజేంద్ర సింగ్‌ రాజ్‌పూత్‌ బరిలో ఉన్నారు.


రంగురాళ్ల గని

  • మధ్యప్రదేశ్‌ సరిహద్దులో ఉండే బాందా నియోజకవర్గం చిత్రకూట్‌ డివిజన్‌లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్‌సహా అన్ని పార్టీలూ గతంలో గెలిచాయి. ఇక్కడ దొరికే రంగురాళ్లను ఆభరణాల తయారీలో వాడతారు. ఎస్సీల జనాభా 24.2 శాతం. ముస్లింలు 21 శాతం ఉంటారు. బ్రాహ్మణులు, కుర్మీలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు.
  • 2014, 2019లలో ఇక్కడ భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి ఆర్‌కే సింగ్‌ పటేల్, సమాజ్‌వాదీ నుంచి శివ్‌శంకర్‌ సింగ్‌ పటేల్‌ పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్‌ కొట్టాలని భాజపా, ఎలాగైనా గెలవాలని సమాజ్‌వాదీ ప్రయత్నిస్తున్నాయి.

అశ్వత్థామ తాకిన నేల

  • ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ.. బ్రహ్మాస్త్రను సాధించడానికి ఫతేపుర్‌ ప్రాంతానికి వచ్చాడని పురాణాల కథనం. ఇక్కడ 87శాతం ప్రజలు గ్రామాల్లో ఉంటారు. ఎస్సీల జనాభా 24.75శాతం. కుర్మీ, నిషాద్, లోధ్‌లు ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారు.
  • 2014, 2019లలో సాధ్వి నిరంజన్‌ జ్యోతి ఇక్కడి నుంచి గెలిచారు. భాజపా నుంచి మళ్లీ ఆమే పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ నుంచి నరేశ్‌ చంద్ర ఉత్తమ్‌ పటేల్‌ బరిలోకి దిగారు. హిందుత్వ ప్రభావం ఇక్కడ అధికం. హ్యాట్రిక్‌ సాధించేందుకు సాధ్వి ప్రయత్నిస్తున్నారు. 

వెనుకబడిన ప్రాంతం

  • కౌశాంబీ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంలో ఉంది. దీనికి అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు అందుతాయి. ఉపాధి, తాగునీరు, విద్య ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. ఎస్సీలకు కేటాయించిన ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. ఇక్కడ 85శాతం హిందువుల జనాభా ఉంటుంది. 
  • 2009లో సమాజ్‌వాదీ, 2014, 2019లలో భాజపా ఇక్కడి నుంచి గెలిచింది. ఈసారి భాజపా తరఫున వినోద్‌ సోంకార్, సమాజ్‌వాదీ తరఫున పుష్పేంద్ర సరోజ్, బీఎస్పీ తరఫున శుభ్‌ నారాయణ్‌ తలపడుతున్నారు. మరోసారి గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది.

పెద్ద నగరం

  • అయోధ్య డివిజన్‌లోని పెద్ద నగరం బారాబంకీ. 76 శాతం హిందువులుంటారు. 22శాతం ముస్లింలుంటారు. 
  • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి రాజ్‌రాణి రావత్, కాంగ్రెస్‌ నుంచి తనూజ్‌ పూనియా పోటీ చేస్తున్నారు. అయోధ్య రామ మందిర అంశం ప్రభావం చూపే ప్రాంతాల్లో ఇది ఒకటి. 

అగ్రవర్ణాల ఆధిపత్యం

  • అగ్రవర్ణాల ఆధిపత్యమున్న కైసర్‌గంజ్‌లో బ్రాహ్మణులు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. 18శాతం దళితులు, 25శాతం ముస్లింలు ఉంటారు.  
  • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున కరణ్‌ భూషణ్‌ సింగ్, సమాజ్‌వాదీ నుంచి భగత్‌ రామ్‌ పోటీ చేస్తున్నారు. హిందుత్వ ప్రభావం తీవ్రంగా ఉన్న నియోజకవర్గమిది. 

పురాతత్వ చరిత్ర

  • పురాతత్వ, చరిత్రాత్మక, మతపరమైన ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం గోండా. అయోధ్యకు పొరుగునే ఉంటుంది. శ్రీరాముడి ఆవులను మేపిన ప్రాంతంగా దీనికి పేరు.  
  • 2014, 2109లలో ఇక్కడి నుంచి భాజపా గెలిచింది. ఈసారి భాజపా నుంచి కీర్తి వర్ధన్‌ సింగ్, సమాజ్‌వాదీ నుంచి శ్రేయావర్మ తలపడుతున్నారు. హిందుత్వ, మోదీల ప్రభావంతో మరోసారి భాజపా గెలిచే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

అయోధ్య నగరి

  • అయోధ్య నగరం కొలువుదీరిన నియోజకవర్గం ఫైజాబాద్‌. రామ మందిర నిర్మాణంతో ఈ ప్రాంతం పులకించిపోయింది. ఇక్కడ 76 శాతం హిందువులు ఉంటారు.  
  • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన లల్లు సింగ్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ నుంచి అవధేశ్‌ ప్రసాద్, బీఎస్పీ నుంచి సచ్చిదానంద్‌ పాండే బరిలో నిలిచారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని