Chandrababu: సమ దృష్టి.. అన్ని ప్రాంతాల అభివృద్ధి

‘ఇకపై ప్రజా వేదిక కూల్చివేత వంటి విధ్వంసాలుండవ్‌. కక్షసాధింపులు, అరాచక రాజకీయాలు ఉండవ్‌. దాడులు చేసి, బాధితుల పైనే కేసులు పెట్డడం జరగదు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదు.

Updated : 12 Jun 2024 06:58 IST

అమరావతే మన రాజధాని
విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం
కర్నూలుపై ప్రత్యేక దృష్టి
ప్రతి అడుగూ ప్రజల కోసమే..
విధ్వంసాలు.. కక్ష సాధింపులు ఉండవు
తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం
ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదు
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్‌షా హామీ ఇచ్చారు
ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు
ఈనాడు - అమరావతి

రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని అసాధారణ విజయం మనకు కట్టబెట్టారు. దీన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఐదు కోట్ల ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో మనం ఎన్నికల్లో పోరాడాం. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంది. 1994లో ఫలితాలు ఏకపక్షంగా వచ్చినప్పుడూ తెదేపాకు ఈ స్థాయిలో సీట్లు దక్కలేదు. ఈసారి 164 గెలిచాం. స్ట్రైకింగ్‌ రేట్‌ 93%. కూటమికి 57% మంది ఓట్లు వేశారు. దీన్నిబట్టే మన బాధ్యత ఎంత పెరిగిందో గుర్తు పెట్టుకోవాలి. 

చంద్రబాబు 


శాసనసభను గౌరవ సభగా చేయాలి..

వైకాపా నాయకులు శాసనసభలో నా కుటుంబాన్ని అవమానించినప్పుడు ఇది గౌరవసభ కాదు, కౌరవ సభ అని చెప్పి.. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచే సభలో అడుగు పెడతానని శపథం చేశాను. ప్రజలు దాన్ని గౌరవించారు. దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంది. శాసనసభను గౌరవసభగా చేసి ప్రజా సమస్యలపై చర్చిస్తామని పవన్‌ కల్యాణ్‌ కూడా చాలాసార్లు చెప్పారు. ప్రజా పరిపాలనను, ప్రజా ప్రభుత్వాన్ని మనం అందజేయాలి’’ 

శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు 


తప్పు చేస్తే ప్రజలు చెప్పే విధానం తెస్తాం

ఓట్లు వేసి నాయకులను గెలిపించడంతో ప్రజలు తమ పని అయిపోయిందనుకోవద్దు. అనునిత్యం ఆశీర్వదిస్తూ నడిపించే బాధ్యతను వారే తీసుకోవాలి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు తెలియజెప్పేందుకు ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తాం’’   

 శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు 


‘ఇకపై ప్రజా వేదిక కూల్చివేత వంటి విధ్వంసాలుండవ్‌. కక్షసాధింపులు, అరాచక రాజకీయాలు ఉండవ్‌. దాడులు చేసి, బాధితుల పైనే కేసులు పెట్డడం జరగదు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదు. అలాగని తప్పు చేసినవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తీ లేదు. వాళ్లను చట్టపరంగా శిక్షిస్తూ, అన్ని వ్యవస్థల్నీ ప్రక్షాళన చేస్తాం. మనది ప్రజా ప్రభుత్వం. సానుకూల దృక్పథంతో పాలన అందిస్తాం. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ప్రజల కోణంలోనే, వారి కోసమే ఉంటుంది. ‘స్టేట్‌ ఫస్ట్‌’ నినాదంతో పాలన సాగిస్తాం’ అని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. బుధవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి పూర్తిగా సహకరించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని తెలిపారు. వైకాపా నాయకుల్లా కక్షపూరిత విధానాల్ని అనుసరించకుండా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. ‘వైకాపా నాయకులు ఏ అహంకారంతో విర్రవీగిపోయారో అది కూలిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు రేపన్నదే లేదన్నట్టు విర్రవీగితే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. దీన్ని ఒక కేస్‌ స్టడీగా తీసుకోవాలి. బూతులు మాట్లాడే నేతల్ని, అరాచకశక్తుల్ని, అవినీతిపరుల్ని ప్రజలు తరిమికొట్టారు. మనం కూడా వాళ్ల మాదిరే కక్ష తీర్చుకోవాలనుకుంటే సమస్య తప్పదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

విశాఖ, కర్నూలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్నీ సమాన దృష్టితో, సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ‘మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి ఇకపై ఉండదు. అమరావతే మన రాజధాని. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఆధునిక నగరంగా తయారు చేసుకుందాం. జగన్‌ విశాఖనే రాజధానిని చేస్తానని, ఈ ఎన్నికల్లో గెలిచి అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని మభ్యపెట్టే మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. నువ్వు మా నగరానికే రావొద్దంటూ.. స్పష్టమైన తీర్పు చెప్పారు. మాపై ఇంతగా అభిమానం చూపిన విశాఖను మర్చిపోయే ప్రసక్తిలేదు. జగన్‌ అటు కర్నూలును జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ చేస్తానని చెప్పి.. ఏమీ చేయకుండా మోసం చేశారు. అందుకే అక్కడా ప్రజలు మా వెంటే ఉన్నారు. రాయలసీమలో ఫలితాలు ఎలా ఉంటాయోనని మొదట్లో కొంత భయపడ్డాను. కానీ ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు. కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.  

పవన్‌ చొరవను మర్చిపోలేను.. 

ఈ ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన పొత్తు కోసం పవన్‌ కల్యాణ్‌ చూపించిన చొరవను, పొత్తుపై సకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెబుతూ వస్తున్న పవన్‌.. నేను జైల్లో ఉన్నప్పుడు పరామర్శించారు. బయటకు వచ్చి తెదేపా, జనసేన కలసి పోటీ చేస్తాయని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నామని ప్రకటించారు. పొత్తుపై మొదట ప్రకటన చేసింది ఆయనే. అప్పటికే ఆయనకు భాజపాతో పొత్తు ఉంది. ఆయన చొరవతో ఈ ఎన్నికల్లో ఎన్డీయే పార్టీల నాయకులు, కార్యకర్తలు పొరపొచ్చాలు లేకుండా పనిచేశారు. ఓటు బదిలీ జరుగుతుందా.. అనే అనుమానాల్ని పటాపంచలు చేశారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

మోదీ, అమిత్‌షాల సహకారం అపూర్వం 

ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర భాజపా నాయకులు ఎంతో సహకారం అందించారని, విస్తృత ప్రచారం నిర్వహించారని చంద్రబాబు కొనియాడారు. ‘అమిత్‌షా ధర్మవరం సభలో మాట్లాడుతూ... పొత్తు ఎందుకు పెట్టుకున్నామో వివరిస్తూ, జగన్‌ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ సూటిగా మాట్లాడారు. రాష్ట్రానికి ఏం అవసరమో చెప్పారు. ఆ సమావేశం తర్వాత రాష్ట్రం మొత్తానికి ఒక నమ్మకం వచ్చింది. ప్రధాని రాజమహేంద్రవరం, అనకాపల్లి, రాజంపేట సభల్లో పూర్తి స్పష్టతనిచ్చారు. విజయవాడలో ఆయన పాల్గొన్న రోడ్‌షో బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కలసి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు. కూటమిలో సహజంగా ఉండే ఫిర్యాదులు ఈసారి ఎక్కడా కనిపించలేదని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు నూటికి నూరు శాతం సమష్టిగా పనిచేశారని పేర్కొన్నారు.

 ‘జనసేన 21 సీట్లు తీసుకుని మొత్తం గెలిచింది. భాజపా పది స్థానాలకుగాను 8 చోట్ల గెలిచింది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రెండుచోట్ల ఓడిపోయాం. అభ్యర్థులు గట్టిగా నిలబడిన ప్రతిచోటా ప్రజలు గెలిపించారు. గాజువాకలో 95 వేల మెజార్టీతో గెలిపించారు. ఇలాంటి విజయం, సంతృప్తి ఎప్పుడూ లేవు. మీరందరూ సాధించిన విజయం వల్ల దిల్లీలో మమ్మల్ని గౌరవించారు’ అని చంద్రబాబు తెలిపారు. 

ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారో! 

‘జగన్‌ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిందో, ఏమేమి తాకట్టు పెట్టిందో లోతులకు వెళితేగానీ తెలీదు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’ అని పేర్కొన్నారు. ‘అప్పట్లో ఏడు మండలాలు ఆంధ్రాకు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు మొదలయ్యేది కాదు. 72 శాతం పనులు పూర్తి చేశాం. వైకాపా ప్రభుత్వం దాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి, నదుల్ని అనుసంధానం చేసి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వగలిగితే అద్భుతాలు చేయొచ్చు’ అని పేర్కొన్నారు.  

మోదీ పాలన దేశ ప్రతిష్ఠను పెంచింది..

‘పదేళ్ల మోదీ పాలన దేశ ప్రతిష్ఠ పెంచింది. ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు తెచ్చింది. పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చింది. ఎన్డీఏ 3.0 పాలనలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. ఇది మనందరికి గర్వకారణం. 2047కి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా చేయడం మోదీ కల. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ మనందరి కల. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్‌ కల. దాన్ని మనం సాధించాలి’ అని తెలిపారు.

చెట్లు కొట్టరు.. పరదాలు కట్టరు 

‘ముఖ్యమంత్రి వస్తున్నారంటే చెట్లు కొట్టేయడం, రోడ్లు మూసేయడం, షాప్‌లు బంద్‌ చేయడం, పరదాలు కట్టుకోవడం ఇక ఉండవ్‌. సీఎంగా నేను, ప్రభుత్వంలో ఏ హోదాలో ఉన్నా మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ సామాన్య వ్యక్తులుగానే మీ దగ్గరకు వస్తాం. మీలో ఒక్కరిగా ఉంటాం. హోదా సేవ కోసమే తప్ప పెత్తనం కోసం కాదు’ అని తెలిపారు. తన కాన్వాయ్‌ వచ్చేటప్పుడు కూడా సిగ్నల్‌కి, సిగ్నల్‌కి మధ్య కొంత గ్యాప్‌ మాత్రమే పెట్టుకోమని, ఎక్కువ సమయం ప్రజల్ని వేచి ఉంచవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. అవసరమైతే మేమే ఐదు నిమిషాలు ఆగుతాం తప్ప, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని