Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్..?

మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా (Maharashtra Governor) పంజాబ్‌ మాజీ సీఎం, భాజపా నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (Amarinder Singh) నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత గవర్నర్‌ కోశ్యారీ త్వరలోనే ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతానని పేర్కొన్న తరుణంలో.. ఆ స్థానాన్ని అమరీందర్‌తో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి.

Updated : 27 Jan 2023 17:19 IST

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్‌ (Maharashtra Governor) బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు భగత్‌సింగ్ కోశ్యారీ (Bhagat Singh Koshyari) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా తెలియజేశానని చెప్పారు. దీంతో త్వరలోనే గవర్నర్‌ పదవికి ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత అమరీందర్‌ సింగ్‌ (Amarinder Singh)ను నియమించే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి సొంతంగా పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (PLC)ని ప్రారంభించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పీఎల్‌సీ కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అంతేకాకుండా పటీయాలా అర్బన్‌ నుంచి పోటీ చేసిన అమరీందర్‌ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో భాజపాలో చేరిన ఆయన.. పీఎల్‌సీని కాషాయ పార్టీలో విలీనం చేశారు.

మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌గా సెప్టెంబర్‌ 2019లో బాధ్యతలు చేపట్టిన కోశ్యారీ.. అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడణవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించడం మొదలు, మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడం వంటి ఘటనలతో విపక్షాల విమర్శలకు గురయ్యారు. ఇటీవల కూడా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదానికి కారణమయ్యారు. శివాజీ మహారాజ్‌ పాతతరం నాయకుడంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆయనను వెంటనే రీకాల్‌ చేయాలంటూ మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోశ్యారీ త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి గవర్నర్‌గా అమరీందర్‌ సింగ్‌ను నియమించే అవకాశాలున్నట్లు భాజపా వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని