Devendra Fadnavis: ఫడణవీస్‌..మీరు రాజీనామా చేయొద్దు: అమిత్‌ షా!

మహారాష్ట్రలో భాజపా పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను పార్టీ అధిష్ఠానం బుజ్జగించింది. పదవిలో కొనసాగాల్సిందిగా కోరింది.

Published : 08 Jun 2024 00:11 IST

దిల్లీ: మహారాష్ట్రలో (Maharashtra) భాజపా (BJP) పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను ఆ పార్టీ అధిష్ఠానం బుజ్జగించింది. పదవిలో కొనసాగాల్సిందిగా కోరింది. ఈ మేరకు అమిత్‌ షా ఆయనకు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఫడణవీస్‌ నేతృత్వంలోని భాజపా.. శివసేన (ఏక్‌నాథ్‌ శిందే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌)తో కలిసి బరిలో దిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి శివసేనతో కలిసి పోటీ చేసిన భాజపా 48 స్థానాలకు గానూ 41 చోట్ల విజయం సాధించింది. కానీ, తాజాగా మహాయుతి కూటమి కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్‌, శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే), ఎన్సీపీ(శరద్‌పవార్‌)లతో కలిసి ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో పార్టీ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ తాను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఫలితాలు వెలువడిన తర్వాతి రోజునే ఫడణవీస్‌ భావించారు. తన నిర్ణయాన్ని అగ్రనేత అమిత్‌ షాకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి పని తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫడణవీస్‌ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమిత్‌షా నివాసంలో ఫడణవీస్‌ ఆయన్ను కలిసి మాట్లాడారు.

ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిప్యూటీ సీఎంగా కొనసాగాలని సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. భాజపా పుంజుకునేందుకు అవసరమైన చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించాలని అమిత్‌ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే.. దాని ప్రభావం పార్టీ కార్యకర్తలపై తీవ్రంగా పడుతుంది. అందుకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’’ అని అమిత్‌షా హితవు పలికినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని