AP Election Results: బూతులు తిట్టే వారికి.. బూత్‌లోనే బుద్ధి చెప్పిన ప్రజలు

సమాజంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నామన్న విచక్షణ కోల్పోయి, బూతు పురాణం ప్రవచించిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు తగు రీతిలో బదులిచ్చారు.

Published : 05 Jun 2024 04:19 IST

కొడాలి నాని, వంశీ, అనిల్, అంబటికి గుణపాఠం
చంద్రబాబు ఇంటిపై దాడికెళ్లిన జోగి ఇంటికే
తెనాలిలో శివకుమార్‌ను ఓటుతో కొట్టిన సామాన్యులు
అరాచక శక్తి పిన్నెల్లి పీచమణిచిన మాచర్ల ఓటరు

ఈనాడు, అమరావతి: సమాజంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నామన్న విచక్షణ కోల్పోయి, బూతు పురాణం ప్రవచించిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు తగు రీతిలో బదులిచ్చారు. ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడ్డ వారికి పోలింగ్‌ బూత్‌లలోనే బుద్ధి చెప్పారు.  ‘విపక్షాలపై తిట్లు, దాడులతో రెచ్చిపోవాలి. అధినేతను స్తుతించాలి. మా ప్రభుత్వంలో పదవులకు ఇవే ప్రమాణాలు’ అని కొత్త నిర్వచనాలు సూత్రీకరించిన నేతాగణాన్ని ఓటర్లు తిరస్కరించారు. 

  • మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) మైకు ముందుకొస్తే చాలు, నోటి వెంట తిట్ల దండకమే. ఆ అసభ్య పదజాలం వినలేక చెవులు మూసుకోవాల్సిన దుస్థితి. అసెంబ్లీలోనూ బూతులు మాట్లాడి చివరికి ‘బూతుల మంత్రి’గా బిరుదు సంపాదించుకున్నారు. ఇంటిల్లిపాది వార్తలు చూస్తున్న క్రమంలో కొడాలి నాని వార్త ప్రసారమైందంటే.. ఆ తిట్లు వినలేక టీవీ ఛానల్‌ మార్చాలి అన్నంత ఘనత సాధించారు. రాజకీయ విమర్శ శ్రుతి మించి, బూతుగా మారితే భరించలేరన్న నిజాన్ని గుడివాడ ప్రజలు నిరూపించారు.
  • మంత్రి జోగి రమేశ్‌ ప్రతిపక్షాలను తిట్టడంలో తోటి మంత్రులతో పోటీ పడ్డారు. నిత్యం నోటి దురుసుతో ప్రవర్తించారు. కృష్ణా జిల్లా పెడన నుంచి ఈసారి పెనమలూరుకు మారి పోటీచేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. అనుచరులను వెంటేసుకొని, కర్రలు చేతపట్టుకొని ఏకంగా చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లిన జోగి రమేశ్‌కు.. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే జగన్‌ మంత్రి పదవి కట్టబెట్టారు. జగన్‌ సందేశాన్ని అర్థం చేసుకున్న పలువురు ఎమ్మెల్యేలు.. రమేశ్‌ పంథాను అనుసరించి విపక్షాలపై నిత్యం నోరు పారేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో తిట్లు, దాడులకు స్థానం లేదని పెనమలూరు ఓటర్లు తీర్పిచ్చారు.
  • మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ అసెంబ్లీలోనే ‘బుల్లెట్‌ దిగిందా? లేదా అనేదే ముఖ్యమ’ంటూ పక్కా ఆకు రౌడీ భాషలో మాట్లాడారు. ప్రతిపక్షాల పట్ల తరచూ దురుసుగా, దుందుడుకుగా ప్రవర్తించారు. ‘దమ్ముంటే చూసుకుందామా’ అంటూ అనిల్‌ చొక్కా చేతులు మడతపెట్టి బెదిరించిన వీడియోలు సామాన్యులను భయపెట్టాయి. వీరు ప్రజాప్రతినిధులా? రౌడీలా అన్న ప్రశ్నకు జవాబే నరసరావుపేట ప్రజల తీర్పు.
  • తెదేపా కార్యాలయంపై దాడులు చేయించడం, శ్రేణులపై పోలీసులతో కేసులు పెట్టించడం, భౌతిక దాడులకు ఉసిగొల్పడం ద్వారా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కన్నతల్లి లాంటి తెదేపాపై కత్తికట్టారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు భార్యపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమన్నట్లు నిరంకుశంగా శాసించారు. చివరకు ఓటరు తీర్పు చూసి, గన్నవరం నుంచి పలాయనం చిత్తగించారు.
  • తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద సామాన్యుడిపై దాడి చేశారు. వరసలో నిలబడి ఓటు వేయాలని అన్నందుకు ఓటరు సుధాకర్‌ చెంపపై కొట్టారు. అనుచరులతో దాడి చేయించారు. సామాన్యుడిపై ఎమ్మెల్యే దాష్టీకాన్ని మధ్యాహ్నం టీవీల్లో చూసిన ఓటర్లు.. సాయంత్రం కల్లా ఓటు రూపంలో తీర్పునిచ్చారు.
  • మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తానొక ప్రజాప్రతినిధిననే విషయాన్ని విస్మరించి ఏకంగా పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంను ధ్వంసం చేశారు. అక్కడే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూర్చున్న తెదేపా వారిపై ఆయుధాలు, కర్రలతో దాడులకు పురికొల్పారు. ఇన్నాళ్లుగా పిన్నెల్లి అరాచకాలకు భరించిన మాచర్ల ఓటర్లు అదనుచూసి గుణపాఠం చెప్పారు.
  • గంట, అర గంట అంటూ అసభ్య మాటలతో మహిళా లోకాన్ని కించపరిచిన మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలయ్యారు. వీరిద్దరి ఆడియో కాల్స్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇలాంటి వారా.. మన పాలకులు అన్న సామాన్యుడి ధర్మాగ్రహం వారిద్దరికీ ఓటమి రుచి చూపించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని