Congress: ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాహులా? ప్రియాంకా?

Congress: కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలుగా చెప్పే యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా తేలాల్సి ఉంది. ఈ నియోజకవర్గాలతో గాంధీ కుటుంబానికి విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే.

Updated : 11 Apr 2024 08:09 IST

తిరువనంతపురం: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ (Congress) తరఫున ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న ఈ స్థానాల్లో తిరిగి వారే బరిలో ఉంటారా? ఇతరులను పోటీలో నిలుపుతారా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ ఈ విషయంపై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు.

‘‘అమేఠీ, రాయ్‌బరేలీ సీట్లపై నిర్ణయం వచ్చేవరకు వేచి చూడండి. ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారు’’ అని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ తెలిపారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా కూడా బరిలో ఉండే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలపై ప్రశ్నించగా.. ‘‘అలా జరగకపోవచ్చు’’ అని ఆయన బదులిచ్చారు. దీంతో ప్రియాంక లేదా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) యూపీ నుంచి పోటీ చేస్తారని స్పష్టమవుతోంది. రాహుల్‌ ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

ఒకప్పటి కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీలో రాహుల్‌ మరోసారి భాజపా నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొంటారా? ప్రియాంకను బరిలోకి దింపుతారా? అన్నది తేలాలి. ‘ఇండియా’ కూటమితో సీట్ల సర్దుబాటులో భాగంగా అమేఠీ కాంగ్రెస్‌కే దక్కింది. ఏప్రిల్‌ 26న వయనాడ్‌లో పోలింగ్‌ పూర్తయిన తర్వాతే.. అక్కడ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ (Rahul Gandhi), ప్రియాంకలో ఎవరు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని