ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్‌ ఠాకూర్‌

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 17 Apr 2024 22:51 IST

ఉనా: తమ సొంత నేతలనే కలిపి ఉంచలేని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అదుపులో ఉంచుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. తమ ఇంటినే చక్కదిద్దుకోలేని వారు ఇక రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలరు? అని ప్రశ్నించారు.  బుధవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాజపా 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని.. కాంగ్రెస్‌కు కేవలం 40 మాత్రమే వస్తాయన్నారు. హిమాచల్‌లో నాలుగు సీట్లూ తమ పార్టీయే గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చుతున్నారంటూ చేస్తోన్న ఆరోపణలపై ఠాకూర్‌ స్పందించారు. తమ సొంత నేతలను అదుపు చేసుకోలేక ఇతరులపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. సామాన్యులు సైతం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి విజన్‌ గానీ, మిషన్‌ గానీ ఏమీలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ గత 60 ఏళ్లలో చేయలేనిది గత పదేళ్లలో దేశ ప్రజలకు అనేక సేవలందించామని చెప్పుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని