AP BJP: ఆశావహులతో ఏపీ భాజపా చర్చలు.. పొత్తులుంటే మంచిదన్న నేతలు!

సార్వత్రిక ఎన్నికలకు ఏపీ భాజపా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీ మరో విడత వారితో ముఖాముఖి నిర్వహిస్తోంది.

Published : 02 Mar 2024 21:42 IST

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు ఏపీ భాజపా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టికెట్‌ ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆ పార్టీ మరో విడత వారితో ముఖాముఖి నిర్వహిస్తోంది. భాజపా ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ శివప్రకాశ్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మధుకర్‌ శనివారం చర్చించారు. పొత్తులపై తుది నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని, ఈలోగా బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాకు తుదిమెరుగులు దిద్దేందుకే ఈ ముఖాముఖిలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఈ సమావేశాలు జరిగాయి. తొలిరోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నాయకులతో చర్చించారు. ఆదివారం మరో 11 జిల్లాల నాయకులతో భేటీ కానున్నారు. 

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై శివప్రకాశ్‌ ఆరా తీసినట్లు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ తెలిపారు. తెదేపా- జనసేన సీట్ల ప్రకటనపై ఈ భేటీలో ప్రస్తావనే రాలేదన్నారు. పొత్తులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ఎప్పుడో త్వరలోనే పార్టీ హైకమాండ్ స్పష్టం చేస్తుందన్నారు. తెదేపా- జనసేన పార్టీలు కేవలం 99 స్థానాలే ప్రకటించాయని, ఇంకా ప్రకటించని స్థానాలు చాలా ఉన్నాయని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. తాను జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పొత్తులుంటే జమ్మలమడుగు సీటు భాజపాకు వస్తుందా? లేదా? అనే అంశాన్ని కూడా పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. పొత్తులతోనే వెళ్తే మంచిదనే అభిప్రాయాన్ని వెల్లడించానన్నారు. పొత్తులు ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని