Amaravati: ఓట్ల తొలగింపు.. 8 జిల్లాల కలెక్టర్లపై ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 30 Nov 2023 21:56 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం తెదేపా నేతలతో కలిసి శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల కలెక్టర్లపై ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని, తెదేపా ఓట్లు తొలగిస్తూ వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఎన్నికల అధికారి ఆదేశాలను కూడా లెక్కచేయట్లేదని ఆరోపించారు. ఫారం- 7, ఫారం- 8 దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. 

ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీ కూడా నివ్వెరపోతోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. వైకాపా నేతలు ఆన్‌లైన్‌, మాన్యువల్‌గా నకిలీ ఓట్లను భారీగా చేర్చుతున్నారని ఆరోపించారు. తహశీల్దార్లు తనిఖీ చేయకుండానే జాబితాలో ఓట్లు చేర్చుతున్నారని, అర్ధరాత్రి ఓట్ల దరఖాస్తులు క్లియర్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉరవకొండలో జరుగుతున్న అక్రమాలపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని