Shashi Tharoor: సల్వార్‌ కనుగొన్న వారికి సలాం.. పంజాబ్‌ మహిళలపై శశిథరూర్‌ ప్రశంసలు

పంజాబ్‌ మహిళలు కనిపెట్టిన సల్వార్‌ కమీజ్‌వైపే ఇప్పుడు దేశం మొత్తం చూస్తోందని, వారిని కచ్చితంగా అభినందించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్‌ నేత శశిథరూర్‌ అన్నారు.

Published : 28 May 2024 16:09 IST

 

 

చండీగఢ్‌: చీరలకు పుట్టినిల్లయిన భారత్‌లోనే వాటికి ఆదరణ కరవవుతోందంటూ గతంలో ఆవేదన వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఇప్పుడు పంజాబ్‌ మహిళలు కనిపెట్టిన సల్వార్‌ కమీజ్‌ (salwar kameez)వైపే చూస్తోందన్నారు. ఇంతటి సౌకర్యవంతమైన దుస్తులు రూపొందించిన పంజాబ్‌ (Punjab) మహిళలను కచ్చితంగా అభినందించాల్సిందేనని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌ మహిళలు ఎక్కువగా ధరించే సల్వార్‌ కమీజ్‌ గురించి ప్రస్తావించారు. తన సొంత రాష్ట్రం కేరళలోనూ ఇటీవల ఈ దుస్తులు విశేషంగా ఆకర్షిస్తున్నాయని, చాలామంది మహిళలు చీరలకు బదులుగా వీటినే కట్టుకుంటున్నారని చెప్పారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా.. సౌకర్యవంతంగా ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరోవైపు పంజాబ్‌లో వేర్వేరుగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు, పంజాబ్‌, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో మాత్రం పొత్తుపెట్టుకోవడంపై ఆయన వివరణ ఇచ్చారు. సువిశాల భారతదేశంలో ప్రతీ రాష్ట్రానికి కొన్ని ప్రాధామ్యాలు, రాజకీయ పరిస్థితులు ఉంటాయని వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు కేరళలో గత 55 ఏళ్లుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మధ్య అధికార మార్పిడి జరుగుతూనే ఉందని, అక్కడ వేర్వేరుగా పోటీ చేస్తున్నామని గుర్తు చేశారు. ఆ పక్క రాష్ట్రం తమిళనాడులో మాత్రం డీఎంకే, ముస్లింలీగ్‌తో కలిసి కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తున్నాయని అన్నారు. 

పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ, చండీగఢ్‌, దిల్లీలో ఆమ్‌ఆద్మీతో పొత్తు పెట్టుకోవడంపై ఆశ్చర్యపోనవసరం లేదని, ప్రజలకు స్థానిక పరిస్థితుల గురించి అవగాహన ఉందని చెప్పారు. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని,  రైతు వర్గాల నుంచి పార్టీకి విశేష మద్దతు లభిస్తోందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో  స్థానిక ఆప్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిందన్నారు. తాజా ఎన్నికల్లో 400కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని చెబుతున్న భాజపా.. 200 స్థానాల్లో నెగ్గడం కూడా కష్టమేనని శశిథరూర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని