ఎన్నికల్లో కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌కు, రాహుల్‌ ఆప్‌నకు ఓటేస్తారు:రాఘవ్‌ చద్దా

శస్ర్త చికిత్స అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ నేత రాఘవ్‌ చద్దా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తోందని పేర్కొన్నారు.

Published : 22 May 2024 14:54 IST

దిల్లీ: కంటి శస్త్రచికిత్స అనంతరం దిల్లీకి తిరిగొచ్చిన ఆమ్‌ ఆద్మీ (AAP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కాంగ్రెస్‌కు ఓటేస్తారని, రాహుల్‌ గాంధీ  (Rahul Gandhi) ఆప్‌నకు ఓటేస్తారని తెలిపారు. దక్షిణ దిల్లీలో ఆప్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాహి రామ్ పహిల్వాన్‌కు మద్దతుగా చద్దా ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి వచ్చాయని పేర్కొన్నారు. మన ఓటుపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

ఆప్‌ అధికారంలోకి వచ్చాక దిల్లీ ప్రజలు విద్యుత్, మందులు, నీరు, పాఠశాల ఫీజులపై నెలకు సుమారు రూ.18,000 ఆదా చేసుకోగలుతున్నారని చద్దా అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.  ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కూటమి విజయంపై విశ్వాసం వ్యక్తంచేసిన రాఘవ్ చద్దా.. ఈసారి దక్షిణ దిల్లీలో అత్యధిక ఓట్లతో గెలుస్తామని దీమా వ్యక్తంచేశారు. మే 25న ప్రజలు చీపురు గుర్తుకు ఓటేయాలని కోరారు.

2019లో రాఘవ్ చద్దా దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, భాజపా అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని