Asaduddin Owaisi: ఓటమి ఎరుగకుండా.. ‘పతంగి’ ఎగురవేత

‘హైదరాబాద్‌ హమారా షహర్‌’ నినాదంతో ఎన్నికల్లో దూసుకెళ్తున్న మజ్లిస్‌ పార్టీ తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో తన కంచుకోట హైదరాబాద్‌ స్థానంలో మరోసారి ఘనవిజయం సాధించింది.

Published : 05 Jun 2024 06:51 IST

వరుసగా ఐదోసారి పార్లమెంటు సభ్యుడిగా అసదుద్దీన్‌ ఒవైసీ గెలుపు

ఎన్నికల అధికారి అనుదీప్‌ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న అసదుద్దీన్‌ ఒవైసీ

ఈనాడు, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ హమారా షహర్‌’ నినాదంతో ఎన్నికల్లో దూసుకెళ్తున్న మజ్లిస్‌ పార్టీ తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో తన కంచుకోట హైదరాబాద్‌ స్థానంలో మరోసారి ఘనవిజయం సాధించింది. ఇక్కడ 1984 నుంచి ఓటమనేదే ఎరుగకుండా విజయ ‘పతంగి’ ఎగురవేస్తోంది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ 3.38 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోషామహల్‌ మినహాయిస్తే మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పుర, యాకుత్‌పుర, మలక్‌పేటలో ఒవైసీ తన సమీప ప్రత్యర్థులు కొంపెల్ల మాధవీలత, మహ్మద్‌ వలీవుల్లా సమీర్‌లపై ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. గోషామహల్‌లో భాజపా అభ్యర్థి మాధవీలతకు 61 వేలకు పైగా మెజారిటీ వచ్చింది.

40 ఏళ్లుగా తండ్రీకొడుకులే... 

హైదరాబాద్‌ స్థానంలో 1984 నుంచి 2024 ఎన్నికల వరకు తండ్రీకొడుకులు  సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ, అసదుద్దీన్‌ ఒవైసీలే విజయం సాధించారు. 1984లో సలావుద్దీన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 1989, 1991, 1996, 1998, 1999 మధ్యంతర, సార్వత్రిక ఎన్నికల్లో ఆయనే గెలుస్తూ వచ్చారు. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయన వారసుడిగా అసదుద్దీన్‌ ఒవైసీ బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఆయన ఐదోసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు

.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని