Amit Shah: అశోక్‌ గహ్లోత్‌ రాజీనామా చేయాల్సిందే: అమిత్‌ షా

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.

Published : 26 Aug 2023 19:46 IST

జైపుర్‌: దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన ‘రెడ్‌ డైరీ’ (Red Diary) అంశానికి బాధ్యత వహిస్తూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) డిమాండ్‌ చేశారు. ఆ డైరీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి, చీకటి ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. రాజస్థాన్‌లో గంగాపుర్‌ పట్టణంలో నిర్వహించిన ‘సహకార్‌ కిసాన్‌ సమ్మేళన్‌’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచామని గుర్తు చేశారు. అంతేకాకుండా రైతు సహకార సంఘాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అమిత్‌ షా ప్రసంగిస్తుండగా.. కొందరు భాజపాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. ‘ ఈ సమావేశానికి కొంత మందిని పంపించి వ్యతిరేక నినాదాలు చేయించినంత మాత్రాన ఏమీ సాధించలేరని గహ్లోత్‌కు ఈ వేదికపై నుంచి చెబుతున్నా. ఏమాత్రం సిగ్గున్నా..వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు దిగండి.’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య గహ్లోత్‌కు ఎరుపు రంగును చూస్తే విపరీతమైన కోపం వచ్చేస్తోందని ఎద్దేవా చేశారు. డైరీ ఎరుపు రంగులో ఉన్నా.. అందులోని ఒప్పందాలు మాత్రం నల్లనివేనని విమర్శించారు. రూ.వేల కోట్ల అవినీతికి సంబంధించిన వివరాలు ఆ డైరీలో ఉన్నాయని అన్నారు.

ఇటీవల రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా రెడ్‌ డైరీ ప్రస్తావనను అసెంబ్లీలో తెచ్చారు. రాజస్థాన్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌లో అవకతవకలకు సంబంధించి ఛైర్మన్‌ ధర్మేంద్ర రాఠోడ్‌ ఇంట్లో ఈడీ, ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచన మేరకు తాను రెడ్‌ డైరీని జాగ్రత్త పరిచానని రాజేంద్ర గుఢా తెలిపారు. అశోక్‌ గహ్లోత్‌, ఆయన కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ల సూచనల మేరకు డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చానని రాఠోడ్‌ ఆ రెడ్‌ డైరీలో రాశారని వివరించారు. దీంతో ఇటీవల లోక్‌సభ సమావేశాల్లోనూ ఈ అంశం తీవ్ర దుమారం రేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని