Ashok Gehlot: సచిన్ పైలట్‌కు మద్దతుగా సీఎం అశోక్‌ గహ్లోత్‌ ట్వీట్‌!

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌.. మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పైలట్‌ తండ్రిపై భాజపా నేత చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ ట్వీట్‌ చేశారు.

Published : 17 Aug 2023 01:42 IST

జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌(Rajasthan Congress)లో అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot), సచిన్‌ పైలట్‌(Sachin Pilot) వర్గాల మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీఎం గహ్లోత్‌, మాజీ డిప్యూటీ సీఎం పైలట్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తలెత్తిన పరిణామాలు కాంగ్రెస్‌(Congress) అధిష్ఠానానికి తీవ్ర తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సచిన్‌ పైలట్‌ తండ్రిపై భాజపా చేసిన ఆరోపణలను ఖండించిన సీఎం గహ్లోత్‌ ఆయనకు మద్దతుగా నిలిచారు.  ధైర్యవంతుడైన రాజేశ్‌ పైలట్‌ను అవమానించడం ద్వారా వైమానిక దళం త్యాగాన్ని అవమానించడమేనంటూ ట్వీట్‌ చేశారు. 

‘అది అబద్ధం.. సర్టిఫికెట్ ఇదిగో’.. భాజపా నేతకు సచిన్‌ పైలట్‌ కౌంటర్‌

మిజోరం రాజధాని ఐజ్వాల్‌పై అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(IAF)లో పైలట్‌గా ఉన్న సచిన్‌ పైలట్‌ తండ్రి రాజేశ్‌ పైలట్‌ బాంబులు జారవిడిచారంటూ భాజపా ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఇటీవల ఆరోపించారు. ఆ రోజు ఈ దాడిలో పాల్గొన్న రాజేశ్‌ పైలట్‌, సురేశ్‌ కల్మాడీలను కాంగ్రెస్‌ పార్టీ.. ఎంపీలను చేసిందని, మంత్రులుగా నియమించిందంటూ ట్వీట్‌ చేశారు. ఈశాన్య రాష్ట్రాలపై దాడులుచేసి వారిని కాంగ్రెస్‌ పార్టీ సత్కరించిందని చేసిన విమర్శలపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ దీటుగా స్పందించారు.  కాంగ్రెస్‌ నేత రాజేశ్‌ పైలట్‌ వైమానిక దళంలో ఓ ధైర్యవంతుడైన పైలట్‌ అన్నారు. ఆయన్ను అవమానించడం ద్వారా భారత వైమానిక దళం త్యాగాన్ని  భాజపా అవమానిస్తోందంటూ మండిపడ్డారు. భాజపా తీరును యావత్‌ దేశం ఖండించాలని పిలుపునిస్తూ ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.  పైలట్‌ కుటుంబంపై భాజపా దాడి చేయడాన్ని ఖండిస్తూ సచిన్‌ పైలట్‌కు మద్దతుగా నిలవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఐక్యంగా ఉందన్న సంకేతాన్ని ప్రజకు ఇచ్చినట్లుగా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Sachin pilot, Politics news, Ashok gehlot, telugu news, Rajasthan politics
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని