TDP leader: తెదేపా నాయకుడిపై దాడి

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైకాపా మూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Published : 28 May 2024 05:05 IST

వైకాపా కార్యకర్తల పనేనంటున్న బాధితుడు   
పోలింగ్‌ రోజు వివాదంతో కక్షకట్టి బరితెగింపు 

తలకు గాయంతో పూర్ణచంద్రరావు 

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైకాపా మూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పోతునూరు గ్రామంలో తెదేపా నాయకుడు గండి కనక పూర్ణచంద్రరావు(రాజా)పై సోమవారం కాంక్రీట్‌ రాయితో దాడి చేసి గాయపర్చారు. సాయంత్రం పూర్ణచంద్రరావు, మరో నలుగురు గ్రామంలో నడిచి వెళుతుండగా మొదట దూరం నుంచి ఓ కర్ర విసిరారు. దీంతో పూర్ణచంద్రరావుకు కొద్దిపాటి దెబ్బ తగలగా, దాన్ని విసిరినవారు కనిపించలేదు. తిరిగి వస్తుండగా ఆయన తలకు ఓ కాంక్రీట్‌ రాయి బలంగా తాకడంతో తీవ్ర గాయమై కుప్పకూలిపోయారు.

దాడి చేసింది ఈ కాంక్రీట్‌ రాయితోనే 

పక్కనున్న వారు చుట్టుపక్కల వెతికినా, రాయి విసిరిన వారు కనిపించలేదు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ‘పోలింగ్‌ రోజు ఓ తెదేపా కార్యకర్త ఓటేసేందుకు వస్తే వీల్లేదంటూ కొందరు వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. అతనికి నేను మద్దతుగా నిలవడంతో కౌంటింగ్‌లోగా నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. ప్రస్తుతం జరిగిన దాడి ఆ వైకాపా కార్యకర్తల పనే’ అని బాధితుడు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి అభ్యర్థి, తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆసుపత్రికి వచ్చి పూర్ణచంద్రరావును పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని