Bandi Sanjay: కార్యకర్త నుంచి కేంద్ర సహాయ మంత్రి దాకా..

కరీంనగర్‌ నుంచి దిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సామాన్య కార్యకర్తగా భాజపాలో పని చేసిన ఆయన ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదిగారు.

Published : 10 Jun 2024 04:57 IST

 బండి సంజయ్‌ రాజకీయ ప్రస్థానం

ఈనాడు, కరీంనగర్‌: కరీంనగర్‌ నుంచి దిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సామాన్య కార్యకర్తగా భాజపాలో పని చేసిన ఆయన ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదిగారు. కరీంనగర్‌ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కౌన్సిలర్‌గా, కార్పొరేషన్‌ ఏర్పాటయ్యాక కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. బండి సంజయ్‌ స్వస్థలం కరీంనగర్‌. స్థానిక శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేస్తూ ఏబీవీపీ పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. తరువాత భారతీయ జనతా పార్టీలో యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2016లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. దిల్లీలో భాజపా జాతీయ కార్యాలయంలో ప్రచార ఇన్‌ఛార్జిగా కొంతకాలం కొనసాగారు. ఆడ్వాణీ రథయాత్రలో ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. కరీంనగర్‌ అర్బన్‌ సహకార బ్యాంక్‌ పాలకవర్గ సభ్యుడిగా 1994 నుంచి 1999 వరకు, తిరిగి 1999 నుంచి 2003 వరకు రెండుసార్లు ఎన్నికయ్యారు. గడిచిన మూడు పర్యాయాలు కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత 2019లో తొలిసారిగా కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 2020 మార్చి 11 నుంచి 2023 జులై 3వ తేదీ వరకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం భాజపాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు.

కరీంనగర్‌ ఇంట్లో సంజయ్‌ తల్లి శకుంతలకు మిఠాయి తినిపిస్తున్న కుటుంబ సభ్యులు 

 రాష్ట్ర ప్రగతి, కరీంనగర్‌ అభివృద్ధికి పాటుపడతా: సంజయ్‌ 

కేంద్ర మంత్రిగా పనిచేసేందుకు వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని బండి సంజయ్‌ చెప్పారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణం చేసిన అనంతరం ఆయన తన స్పందన తెలియజేశారు. ‘‘నాపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. నాకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే. కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించినందువల్లే ఈ అవకాశం లభించింది. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటా. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదొక్కటే. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నా. అలాగే తెలంగాణ ప్రజలు భాజపాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని సంజయ్‌ తెలిపారు. 

పేరు: బండి సంజయ్‌కుమార్‌

పుట్టిన తేదీ: 11-7-1971

తల్లిదండ్రులు: శకుంతల, బండి నర్సయ్య

భార్య: బండి అపర్ణ (ఎస్‌బీఐ ఉద్యోగి)

పిల్లలు: సాయిభగీరథ్, సాయి సుముఖ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని