Bandi sanjay: లోక్‌సభలో భారాస, కాంగ్రెస్‌పై విరుచుకుపడిన బండి సంజయ్‌

తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్‌ భాజపా ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

Updated : 10 Aug 2023 18:02 IST

దిల్లీ: తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్‌ భాజపా ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌, భారాసపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వారికే క్లారిటీ లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడి వ్యవహారం చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు. ముద్దులు పెడతారు.. ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తారు.. మరో సారి కౌగిలించుకుంటారు... ఒకసారి కన్ను కొడతారు. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తాడు. భరతమాతను హత్య చేశారంటున్నారు. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇక్కడ ఉన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో లేరు. ఏ కాంగీ, బెంగాల్‌ కా దీదీ, దిల్లీ కా కేజీ, బిహార్‌ కా జేడీ, తెలంగాణ కా కేడీ. వీళ్లతోని ఏమీ కాదు. ప్రధానమంత్రి నేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శక్తిమంతమైన భారత దేశ నిర్మాణం కోసం కృషి చేస్తోంది. 

నాడు.. సుష్మాస్వరాజ్‌ హెచ్చరికతోనే కాంగ్రెస్‌ దిగొచ్చింది..

నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం ఈ పార్లమెంట్‌. నీళ్లు, నిధులు, నియామకాలు, మా పాలన మాకు కావాలని 1400 మంది బలిదానం అయిన తర్వాత సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తెలంగాణ కోసం 1,400 మంది అమరులయ్యారు. రివాల్వర్‌తో కాల్చుకున్నారు. రైలు వస్తుంటే.. జై తెలంగాణ అని ఎదురెళ్లి ఆత్మబలిదానం చేసుకున్నారు. అయినా, కాంగ్రెస్‌.. తెలంగాణ ఇవ్వలేదు. ఇదే లోక్‌సభ వేదికగా తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మాస్వరాజ్‌.. తెలంగాణ యువకులారా ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మీరు కోరుకున్న తెలంగాణను ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మీరు తెలంగాణ ఇస్తారా? లేదంటే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం అని కాంగ్రెస్‌ను హెచ్చరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ బిల్లుపెడితే భాజపా మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చిన్న రాష్ట్రాలకు భాజపా అనుకూలం. 1997లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా భాజపా తీర్మానం చేసింది.

సీఎం కుటుంబం ఆస్తులు పెరిగాయి... రైతుల ఆదాయమేది?

చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఒక కుటుంబం తెలంగాణలోకి వచ్చింది. అవినీతి యూపీఏ.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ అయిన తెరాస.. భారాసగా మారింది. భారాస పేరు భ్రష్టాచార్‌ రాక్షస సమితి. భారాస అధినేత  కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రిజ్వీ. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబం దోచుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు పెరిగాయి. సీఎం భార్య ఆస్తులు 1800శాతం పెరిగాయి. తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ.1,12,236 అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  వ్యవసాయం ద్వారా ఆదాయం రూ.కోటి. కుమారుడి వ్యవసాయ ఆదాయం రూ.59,85,000 ఆదాయం. రైతుల ఆదాయం పెరగలేదు కానీ, సీఎం కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. 24గంటలు కరెంటు ఇస్తున్నామని నామా నాగేశ్వరరావు చెప్పారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. లేని పక్షంలో వాళ్లు రాజీనామా చేయడానికి సిద్ధమా?

కేంద్రం ఇచ్చిన నిధులను భారాస దోచుకుంటోంది

పీఎంఏవై పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ.2.50లక్షల చొప్పున నరేంద్రమోదీ ప్రభుత్వం ఇస్తే.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం చేశారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం ఇచ్చే నిధులను దోచుకున్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద పేదలకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తే.. లబ్ధిదారుల నుంచి భారాస నేతలు డబ్బులు వసూలు చేశారు. జాతీయ రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదు. మణిపుర్‌కు ప్రధాని వెళ్లలేదంటున్నారు.. తెలంగాణ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు, ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం వెళ్లలేదు. ఒకటో తేదీకి జీతాలు ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, భారాస కుమ్మక్కయ్యాయి. భాజపాను నిక్కర్‌ పార్టీ అని కాంగ్రెస్‌ విమర్శించడం దారుణం. లిక్కర్‌ పార్టీతో కాంగ్రెస్‌ కలిసిపోయింది. దిల్లీలో విడివిడిగా ఉన్నట్టు నటిస్తారు.. తెలంగాణలో భారాస, కాంగ్రెస్‌ ఒక్కటే. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు భారాసలో చేరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు వేసినట్టే’’ అని బండి సంజయ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని