Telangana News: ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది: భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. జాతీయ పార్టీ పెట్టడం ఇంకా ఊహాజనితంగానే ఉందన్నారు. ఈ విషయం మీద ప్రస్తుతం తానేమీ స్పందించలేనని.. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించాక మాట్లాడుతానని చెప్పారు. కేసీఆర్‌ విమానం కొనడం ఆయన వ్యక్తిగత నిర్ణయమన్నారు.

Published : 03 Oct 2022 01:20 IST

హైదరాబాద్‌: దేశంలో విభజన, అశాంతి అంశాలు ప్రజలను ఎంతోగానో అందోళనకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు లేని దేశం కావాలని  మహాత్మాగాంధీ కోరుకున్నారని తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. భాజపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని.. గాంధీ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మతాన్ని చొప్పించి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందన్న భట్టి.. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. గాంధీ ఆలోచనా విధానంతోనే రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీల్లో సీఎల్పీ పక్షాన పర్యటనలు చేస్తామని ప్రకటించారు.

మల్లిఖార్జున ఖర్గే పోటీచేయడాన్ని స్వాగతిస్తున్నాం..

ఏఐసీసీ అధ్యక్ష బరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే పోటీచేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బరిలో ఉన్న మరో సీనియర్‌ నేత శశిథరూర్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకొని.. ఖర్గేకి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన మల్లిఖార్జున ఖర్గే అపార అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయనను గెలిపించేందుకు దేశంలోని కాంగ్రెస్‌ నాయకులందరు సహకరించాలని కోరారు. ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుందన్నారు. భాజపాకి వంత పాడుతున్న మీడియా ద్వారా ఖర్గేపై విషపూరిత ప్రచారం చేస్తున్నారని  ఆరోపించారు. ఆయనను ఒక కులానికి పరిమితం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత, కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత కలిగిన గాంధేయవాది అయిన ఖర్గే చరిత్రను తెలుసుకొని విష ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 

కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు భట్టి స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ విమానం కొనడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని.. జాతీయ పార్టీ ఇంకా ఊహాజనితంగానే ఉందన్నారు. ఈ విషయం మీద ప్రస్తుతం తానేమీ స్పందించలేనని.. జాతీయ పార్టీ ప్రకటించాక మాట్లాడుతానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని