Loksabha polls: బెంగాల్లో భాజపా అభ్యర్థిపై దాడి...తృణమూల్ పనేనన్న కేంద్రం

లోక్‌సభ ఎన్నికల ఆరోవిడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.  ఈనేపథ్యంలో ఝర్‌గ్రామ్‌లో పోలింగ్‌ బూత్‌లో గుర్తు తెలియని దుండగులు భాజపా అభ్యర్థిపై దాడికి యత్నించారు.

Published : 25 May 2024 18:47 IST

కోల్‌కతా: స్థానిక భాజపా నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌ (Jhargram)లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న ఝర్‌గ్రామ్‌ నియోజకవర్గానికి చెందిన భాజపా అభ్యర్థి ప్రణత్ టుడు(Pranat Tudu),    ఆయన అనుచరులతో పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లారు. వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు అభ్యర్థి, ఆయన అనుచరులపై  రాళ్లు రువ్వుతూ దాడికి దిగారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో భాజపా నేత కారు ధ్వంసమైంది. కాగా దాడిపై స్పందించిన భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన టీఎంసీ నేతలు ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్‌ బూత్‌ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని ఆరోపించారు. 

ఈ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థి కలిపాడ, సీపీఐ(ఎం) అభ్యర్థి సోనామణి, భాజపా అభ్యర్థి ప్రణత్ టుడు పోటీ పడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లోని పురూలియా జిల్లాల్లో ఉన్న ఝార్‌గ్రామ్ రిజర్వ్‌డ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి లోక్‌సభ ఎన్నికల ఆరోవిడతలో భాగంగా నేడు పోలింగ్ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని