TS News: సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. 

Published : 19 Apr 2024 22:29 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రతినిధిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విచ్చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎస్‌.వీరయ్య తదితరులతో భట్టి విక్రమార్క దాదాపు 30 నిమిషాలపాటు చర్చించారు. ఇండియా కూటమిలో మిత్రపక్షంగా సీపీఎం ఉందని, ఆ పార్టీ మద్దతు అడిగేందుకు వచ్చినట్టు భట్టి తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని భావించినప్పటికీ కుదరలేదని, జాతీయ పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం శ్రేణులను కలుస్తామని వివరించారు. మద్దతు అంశంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి చెబుతామని హామీ ఇచ్చారని, సీపీఎం మద్దతు తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అడిగిన సీట్లు ఇవ్వలేకపోయామని, భవిష్యత్తులో తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి మినహా అన్ని స్థానాల్లో తమ మద్దతు కలిసి వచ్చే పార్టీలకే అని నిర్ణయించినట్టు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణలో భాజపా విస్తరించకుండా ఆ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. శనివారం మరోసారి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతామని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు నిర్ణయానికి వస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని