Bhatti Vikramarka: పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా?: భట్టి

సూర్యాపేటలో భారాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు.

Updated : 01 Apr 2024 18:05 IST

దిల్లీ: సూర్యాపేటలో భారాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. భారాస నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆయన తట్టుకోలేపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా?అని ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మైక్‌ సమస్య వస్తే..కరెంట్‌ కోతలు అంటూ అబద్ధాలు మాట్లాడారని చెప్పారు.

సరఫరా లేకుంటే విద్యుత్‌ వినియోగం ఎలా పెరిగింది?

‘‘బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.మీ. దూరంలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పెట్టారు. దూరంగా ఉండటం వల్ల థర్మల్‌ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చువుతోంది. పర్యావరణ అనుమతులు పొందటంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉంది. విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరయ్యింది. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్‌ నిర్మించాల్సి ఉంది. కానీ, కమీషన్ల కోసం సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి పవన్‌ ప్లాంట్‌ చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా నమోదైంది. సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరిగింది?

చర్చకు రావడానికి సిద్ధం

ఏప్రిల్‌, మే నెలలోనూ సరిపడా విద్యుత్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. దేశమంతా గ్రిడ్‌ అనుసంధానం 2013లోనే యూపీఏ ప్రభుత్వం చేసింది. పదేళ్లలో పాలనలో కేసీఆర్‌ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలి. అందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారా?ప్రతి మండలంలో బాలబాలికలకు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా? రైతులకు రుణమాఫీ ఐదేళ్లలో పూర్తి చేశారా? వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరు? వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసిందెవరు? ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం కుంగిపోయింది. అన్ని లెక్కలతో చర్చకు రావడానికి నేను సిద్ధం’’ అని భట్టి విక్రమార్క సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని