Lok Sabha Elections: 9 ఓట్ల తేడాతో వీళ్లు.. 98శాతం ఓట్లతో వాళ్లు: లోక్‌సభ ఎన్నికల్లో ఈ రికార్డులు తెలుసా?

లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీ ప్రీతమ్‌ ముండే..! మరి అత్యల్ప మెజార్టీ ఎవరిది? ఈ విశేషాలు చూద్దాం..!

Updated : 03 Jun 2024 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల్లో గెలవడం అంటేనే ఓ కిక్కు..! ఒక్కోసారి అది అఖండ మెజారిటీ కావొచ్చు.. కొన్నిసార్లు త్రుటిలో గట్టెక్కొచ్చు..! లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే సింగిల్‌ డిజిట్‌ తేడాతో విజయం సాధించారు. మరోవైపు ఓ అభ్యర్థి ఏకంగా 98శాతం ఓట్లతో గెలుపొందారు. మరి ఇప్పటివరకు అత్యధిక, అత్యల్ప మెజారిటీలేంటో తెలుసా?

చరిత్ర సృష్టించిన ప్రీతమ్‌ ముండే..

దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం దక్కించుకున్న నేతగా గుర్తింపు సాధించారు భాజపా నాయకురాలు ప్రీతమ్‌ ముండే. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఈ అరుదైన ఘనత అందుకున్నారు. కేంద్రమాజీ మంత్రి, మహారాష్ట్ర బీద్‌ ఎంపీ గోపీనాథ్‌ ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఆయన కుమార్తె ప్రీతమ్‌ పోటీ చేయగా... రికార్డు స్థాయిలో 6.96 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.

గత ఎన్నికల్లోనే నలుగురు..

ప్రీతమ్‌ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేకపోయారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు 6 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. వీరంతా భాజపా నేతలే. 

గుజరాత్‌లోని నవసరిలో భాజపా నేత సీఆర్‌ పాటిల్‌ 6.89 లక్షల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.

 • హరియాణాలోని కర్నాల్‌లో సంజయ్‌ భాటియా 6.56 లక్షలు, ఫరీదాబాద్‌లో భాజపా అభ్యర్థి కృష్ణపాల్‌ గుజ్జర్‌ 6.38 లక్షల తేడాతో గెలుపొందారు.
 • రాజస్థాన్‌లోని భిల్వాడాలో సుభాష్‌ బహేరియా 6.12 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
 • అంతకుముందు 2004లో సీపీఎం నేత అనిల్‌ బసు ఆరంబాఘ్‌ (పశ్చిమ బెంగాల్‌) నుంచి 5.92 లక్షల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు.

కేవలం 9 ఓట్ల తేడాతో..

సాధారణంగా భారీ మెజారిటీ దక్కిందంటే అక్కడ గెలుపు ఏకపక్షమైనట్లే..! అయితే కొన్నిసార్లు ప్రత్యర్థుల మధ్య విజయం దోబూచులాడుతుంది. చివరకు అత్యల్ప మెజార్టీతో గట్టెక్కాల్సి వస్తుంది. అలా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలు కేవలం 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.

 • 1989లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ తన సమీప అభ్యర్థిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
 • 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్‌ స్థానం నుంచి భాజపా నేత సోమ్‌ మరండి కూడా కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
 • 1996లో గుజరాత్‌లోని బరోడా నుంచి కాంగ్రెస్‌ నేత గైక్వాడ్‌ సత్యజీత్‌ సిన్హా 17 ఓట్ల తేడాతో నెగ్గారు.
 • 1971లో తమిళనాడులోని తిరుచెందూర్‌లో డీఎంకే అభ్యర్థి ఎంఎస్‌ శివస్వామికి 26 ఓట్ల తేడాతో విజయం వరించింది.
 • 2014లో లద్దాఖ్‌ స్థానం నుంచి భాజపా నేత తుప్‌స్తన్‌ చెవాంగ్‌ 36 ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. 1962లో ఔటర్‌ మణిపుర్‌ స్థానం నుంచి రిషాంగ్‌ (మణిపుర్‌ ఆఫ్‌ సోషలిస్ట్‌ పార్టీ) 42 ఓట్లతో నెగ్గారు.
 • 2004లో లక్షద్వీప్‌ నుంచి పోకున్హికోయ 71 ఓట్లు, 1980లో యూపీలోని దేవరియా నుంచి ఇందిరా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రామాయణ్‌ రాయ్‌ 77 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఆయనకు 98శాతం ఓట్లు..

పోలైన ఓట్లలో దాదాపు 90శాతం, అంతకంటే ఎక్కువే దక్కించుకుని లోక్‌సభలో అడుగుపెట్టిన ఎంపీలూ ఉన్నారు. 1989లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ స్థానం నుంచి పీఎల్‌ హండూకు (జమ్మూకశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీ) ఏకంగా 98శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఈ స్థానంలో 7.36లక్షల ఓటర్లుండగా.. కేవలం 5శాతం మంది అంటే 37,377 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 36,055 మంది హండూనే ఎన్నుకొన్నారు. నాడు ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో మెజారిటీ విజయం దక్కింది.

 • ఇక, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో నంద్యాల (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని) లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 89.5శాతం ఓటు షేరు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో 5లక్షల మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టలేదు.
 • లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌.. 1977లో జరిగిన ఎన్నికల్లో బిహార్‌లోని హజీపుర్‌ నుంచి 89శాతం ఓట్లు సాధించారు. మెజారిటీ 4,24,000 కావడం విశేషం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని