Nitish Kumar: బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్ రాజీనామా

బిహార్‌ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్.. ఎన్డీయేతో కూటమి బంధానికి ముగింపు పలికారు

Updated : 09 Aug 2022 16:26 IST

పట్నా: బిహార్‌ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్.. ఎన్డీయేతో కూటమి బంధానికి తెంచుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఈ మేరకు నేడు గవర్నర్‌ ఫాగు చౌహన్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం నీతీశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు.

తేజస్వీ ఇంటికి నీతీశ్‌..

భాజపాతో తెగదెంపులు చేసుకున్న నీతీశ్‌.. ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా తర్వాత గవర్నర్‌ కార్యాలయం నుంచి నేరుగా నీతీశ్‌.. రబ్రీదేవీ నివాసానికి బయల్దేరారు. అక్కడ తేజస్వీ యాదవ్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై నీతీశ్ చర్చించనున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం.

కాగా.. ఆర్జేడీతో కలిసి నీతీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తేజస్వీకి మళ్లీ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు హోం శాఖను కూడా కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా.. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు.

అయితే వీరి రెండేళ్లకే ఈ కూటమి బంధం తెగిపోయింది. 2017లో ఆర్జేడీ- కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న నీతీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీ(యు) - భాజపా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జేడీ(యు) పార్టీకి తక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వానికి నీతీశ్‌ సారథ్యం వహించారు. అయితే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తానే నేతృత్వం వహిస్తున్నప్పటికీ పలు అంశాల్లో మాట చెల్లుబాటుకావడంలేదని నీతీశ్ గతకొంతకాలంగా ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను రాజకీయంగా బలహీనపరుస్తున్న భాజపా నేతలు ఎంతో కాలం ఆ పదవిలో కొనసాగనివ్వబోరన్న అనుమానంతో ఉన్న ఆయన.. కాషాయ పార్టీతో పొత్తుకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించగా.. వారు కూడా మద్దతు తెలిపారు. దీంతో భాజపాకు గుడ్‌బై చెబుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఒకప్పుడు తెగదెంపులు చేసుకున్న ఆర్జేడీతోనే నీతీశ్‌ మళ్లీ జట్టు కట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని