BJP: రాహుల్‌ గాంధీ ప్రత్యర్థిపై 242 క్రిమినల్‌ కేసులు

వయనాడ్‌ నుంచి భాజపా తరఫున బరిలోకి దిగుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌పై 242 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Published : 30 Mar 2024 00:06 IST

దిల్లీ: కేరళ భాజపా అధ్యక్షుడు, వయనాడ్‌ లోక్‌సభ అభ్యర్థి సురేంద్రన్‌పై (Surendran)  242 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనపై నమోదైన కేసుల వివరాలను పత్రికాముఖంగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఎర్నాకుళం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాధాకృష్ణన్‌పై (Radhakrishnan) 211 కేసులు ఉన్నాయి. వయనాడ్‌లో (Wayanad) కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ ఇద్దరు భాజపా అభ్యర్థులపై నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం 2018లో చోటుచేసుకున్న శబరిమల ఆందోళనల సమయంలోనివే కావడం గమనార్హం. వీటిలో చాలా వరకు ప్రస్తుతం విచారణ దశలోనే ఉన్నాయి. ఎక్కడైనా నిరసనలు చోటు చేసుకున్నప్పుడు దాంతో సంబంధం ఉందని భావించిన వారిపైనా కేసులు నమోదు చేశారని, ఈ క్రమంలోనే వీరిపై కేసులు ఎక్కువయ్యాయని భాజపా జనరల్‌ సెక్రెటరీ జార్జ్‌ కురియన్‌ మీడియాకు వెల్లడించారు.

సురేంద్రన్‌పై నమోదైన 242 కేసుల్లో 237 కేసులు శబరిమల ఆందోళలనలకు సంబంధించినవేనని, మిగతా 5 కేసులు కేరళలోని వివిధ నిరసన సమయాల్లో నమోదయ్యాయని కురియన్‌ తెలిపారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు స్థానిక ప్రభుత్వం ముందుకు రావడంతో తీవ్ర స్థాయిలో అందోళనలు రేగిన సంగతి తెలిసిందే. భాజపా, మిత్రపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలకు నేతృత్వం వహించాయి. మరోవైపు మిగతాపార్టీ అభ్యర్థుల కేసుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు రెండో విడతలో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని