Maneka Gandhi: మేనకాగాంధీ ఒంటరిపోరు

అటు అయోధ్య...ఇటు అమేఠీ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు ప్రముఖ ప్రాంతాల మధ్యనున్న సుల్తాన్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో నెలకొన్న త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది.

Updated : 24 May 2024 06:10 IST

సుల్తాన్‌పుర్‌లో భాజపా, ఎస్పీలకు  చెమటలు పట్టిస్తున్న బీఎస్పీ

సుల్తాన్‌పుర్‌: అటు అయోధ్య...ఇటు అమేఠీ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు ప్రముఖ ప్రాంతాల మధ్యనున్న సుల్తాన్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో నెలకొన్న త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. భాజపా అభ్యర్థిగా మేనకా గాంధీ వరుసగా రెండో సారి బరిలో నిలవగా...ఆమె ప్రత్యర్థులుగా రాంభౌల్‌ నిషాద్‌ (ఎస్పీ), ఉద్రాజ్‌ వర్మ (బీఎస్పీ) ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 14,526 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన మేనకా గాంధీ వరుస విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఓబీసీ సామాజిక వర్గం కుర్మీలకు చెందిన ఉద్రాజ్‌ వర్మ...భాజపా, ఎస్పీ అభ్యర్థులకు గట్టి సవాల్‌ విసురుతున్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభౌల్‌ నిషాద్‌కు కాంగ్రెస్‌ మద్దతు లభిస్తున్నప్పటికీ ఓబీసీ ఓట్లలో చీలిక ఎస్పీ నేతలను కలవరపెడుతోంది. నిషాద్‌ సామాజిక వర్గంతో పాటు వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారీటీలపై ఎస్పీ ఆశలు పెట్టుకుంది. అయితే, ఈ వర్గాల్లో పట్టున్న బీఎస్పీ గత ఎన్నికల్లోనూ గట్టిపోటీ ఇచ్చి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా బలమైన కుర్మీల వర్గానికి చెందిన ఉద్రాజ్‌ వర్మను బరిలోకి దించి త్రిముఖ పోటీని రసవత్తరం చేసింది. అయోధ్యకు సమీపంలోనే ఉన్నప్పటికీ సుల్తాన్‌పుర్‌లో జాతీయ అంశాలు చర్చకు రావడం లేదు. రామాలయం అంశాన్ని దేశమంతటా ప్రస్తావిస్తున్న కమలం పార్టీ ఇక్కడ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. స్థానిక సమస్యలే తన ప్రాధాన్య అంశాలని ఆ పార్టీ అభ్యర్థి మేనకా గాంధీ విస్పష్టంగా చెబుతున్నారు. ఆమె తరఫున ప్రచారానికి వచ్చిన ఏకైక భాజపా అగ్రనేత రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. ఆయన కూడా ఒక్క ఖాజీపుర్‌ సభలో మాత్రమే పాల్గొన్నారు. మేనకా గాంధీనే అన్నీ తానై చూసుకుంటున్నారు. ప్రచారం ముగింపు రోజైన గురువారం ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ ఇక్కడకు వచ్చారు. దాదాపు 15 సమావేశాల్లో పాల్గొన్నారు.

వరుణ్‌కు ఈ దఫా ఫీలీభీత్‌ నియోజకవర్గ టికెట్‌ను భాజపా నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. సుల్తాన్‌పుర్‌ నియోజకవర్గ ప్రజలు మేనకా గాంధీని ఎంపీ అని కాకుండా ‘మాతాజీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారని, కులమతాలకు అతీతంగా అందరి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే తన తల్లికి ఓటు వేయాలని వరుణ్‌ విజ్ఞప్తి చేశారు. మేనకాగాంధీ కూడా ముస్లింలు సహా అన్ని వర్గాల ప్రజలను కలిసేందుకు ప్రయత్నించారు. దాదాపు 18 లక్షల ఓటర్లు ఉన్న ఈ లోక్‌సభ స్థానంలో మత్స్యకారుల ఓట్లు 2 లక్షల వరకు ఉన్నాయి. ఆ వర్గం నేత, భాజపా మిత్రపక్షం నిషాద్‌ పార్టీకి చెందిన సంజయ్‌ నిషాద్‌..రాష్ట్ర మంత్రిగా ఉన్నందున ఆ ఓట్లన్నీ తమకే వస్తాయని కమలదళ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ-సీఎం ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న సానుకూలత తమను గెలిపిస్తుందని భాజపా జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కె.వర్మ ధీమా వ్యక్తం చేశారు.సమాజ్‌వాదీ పార్టీ నాయకులు మాత్రం మేనకా గాంధీ స్థానికంగా నివాసం ఉండరని, దిల్లీ నుంచి వచ్చి నెలలో వారం రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారని విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత, ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు, అభివృద్ధిలేమి అంశాలను ఎస్పీ అభ్యర్థి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థానాన్ని గెలుచుకోని ఎస్పీ ఈ దఫా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. 2019లో స్వల్ప తేడాతో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఎస్పీ కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సుల్తాన్‌పుర్‌లో శనివారం (ఈనెల 26న) పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు