Hyderabad: ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ స్పీడు పెంచండి: భాజపా నేతలకు సునీల్‌ బన్సల్ దిశానిర్దేశం

తెలంగాణలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ వేగవంతం చేయాలని భాజపా ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించారు.

Updated : 02 Oct 2022 14:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ వేగవంతం చేయాలని భాజపా ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికతో పాటు హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక, ప్రజాగోస-భాజపా భరోసా, పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమాలపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. మనుగోడులో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళుతూ తెరాస వైఫల్యాలను ఎండగట్టాలని బన్సల్‌ దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత మునుగోడులో గెలుపుకోసం ఏర్పాటు చేసిన ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీతోనూ ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు.

తెరాస నకిలీ ఓట్లు నమోదు చేయిస్తోంది: వివేక్‌

ఈనెల 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భాజపా ఆధ్వర్యంలో బైక్‌ యాత్రలు చేపడతామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. మొత్తం 189 గ్రామాల్లో బైక్‌యాత్రలు జరుగుతాయని.. ఈ కార్యక్రమంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, మండల ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్యనేతలు పాల్గొంటారన్నారు. బూత్‌ కమిటీలను వెంటనే పూర్తిచేయాలని బన్సల్‌ సూచించారని.. ఈనెల 10న బూత్‌ కమిటీ సభ్యులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమావేశమవుతారని చెప్పారు. మునుగోడులో నకిలీ ఓటర్లను తెరాస నమోదు చేయిస్తోందని వివేక్‌ ఆరోపించారు. అందుకే ఓటర్ల జాబితాను పరిశీలించాలని నిర్ణయించామన్నారు. కేసీఆర్‌ అవినీతి, అసమర్థ పాలనను గ్రామగ్రామాన వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రచారం ఎలా చేయాలని.. పార్టీ గుర్తును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని