Pawan Singh: సొంత కూటమి అభ్యర్థిపైనే పోటీ.. ఆ నటుడిపై భాజపా వేటు

Pawan Singh: సొంత పార్టీ అభ్యర్థిపైనే స్వతంత్రుడిగా బరిలోకి దిగిన భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌పై భాజపా క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

Updated : 22 May 2024 11:23 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ (Pawan Singh) వ్యవహారం భాజపా (BJP)కు తలనొప్పిగా మారింది. సొంత పార్టీ అభ్యర్థిపైనే అతడు స్వతంత్రుడిగా పోటీకి నిలబడ్డారు. నామినేషన్‌ వెనక్కి తీసుకోవాలని పార్టీ ఆదేశించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అతడిపై భాజపా క్రమశిక్షణా చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించింది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలుత పవన్‌సింగ్‌ (Singer Pawan Singh)కు భాజపా పశ్చిమ బెంగాల్‌ నుంచి టికెట్‌ కేటాయించిన విషయం తెలిసిందే. అసన్‌సోల్‌ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అదే సమయంలో అతడి పాటలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనంటూ పవన్‌ వెనక్కి తగ్గారు.

రైతన్న ‘మద్దతే’ కీలకం! హరియాణాలో క్లీన్‌స్వీప్‌పై భాజపా దృష్టి

కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా సొంత రాష్ట్రం బిహార్‌ (Bihar)లోని కారాకట్‌ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఎన్డీయే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని భాజపా మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌ మోర్చా పార్టీకి కేటాయించింది. దీంతో భాజపా నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పవన్‌ సింగ్‌ మే 9వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తల్లి కూడా పోటీకి దిగడం గమనార్హం. 

కాగా.. కారాకట్‌ స్థానం నుంచి ఎన్డీయే (NDA) అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) బరిలో ఉన్నారు. ఈయనపై పవన్‌ స్వతంత్రుడిగా పోటీ చేయడాన్ని భాజపా తీవ్రంగా పరిగణించింది. వెనక్కి తగ్గాలని హెచ్చరించినా ఆయన వినిపించుకోకపోవడంతో నేడు పార్టీ నుంచి బహిష్కరించింది. కారాకట్‌ స్థానానికి చివరి విడతలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని