Mainpuri bypoll: తోడికోడళ్ల సవాల్‌ లేదు.. డింపుల్‌కు పోటీగా ఆయనే..!

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా మాజీ ఎంపీ రఘురాజ్‌ సింగ్ శాఖ్య బరిలోకి దిగారు.

Published : 15 Nov 2022 15:56 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ మంగళవారం అభ్యర్థిని ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌కు పోటీగా మాజీ ఎంపీ రఘురాజ్‌ సింగ్ శాక్యను బరిలోకి దింపింది. ములాయం సింగ్‌ యాదవ్‌ తమ్ముడు శివపాల్‌ యాదవ్‌కు.. శాక్య అత్యంత సన్నిహితుడు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఎస్పీలో చీలిక ఏర్పడిన సమయంలో శివపాల్‌ వర్గంలో చేరారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో శివపాల్‌కు ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి.. భాజపాలో చేరారు.

ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ మరణంతో మైన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఎన్నికల్లో ములాయం కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌ యాదవ్‌ బరిలోకి దిగారు. ఇందుకోసం సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో డింపుల్‌కు పోటీగా ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ను భాజపా పోటీకి నిలబెడుతుందని అంతా భావించారు. ఇటీవల అపర్ణా యాదవ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్‌ ఛౌదరీతో సమావేశమవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. కానీ, భాజపా అందుకు భిన్నంగా శాక్యను బరిలోకి దింపింది.

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేశ్ యాదవ్‌, శివపాల్‌ మళ్లీ ఒక్కటయ్యారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇరు వర్గాల్లో ఓట్ల చీలిక తమకు అనుకూలంగా మారే అవకాశముందని భాజపా  ఆశిస్తోంది. మరోవైపు.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మైన్‌పురి అసెంబ్లీ స్థానంలో కాషాయ పార్టీ విజయం సాధించింది. దీంతో ఉప ఎన్నిక విజయంపై కమలం నేతలు ధీమాగా కన్పిస్తున్నారు. అయితే మైన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట లాంటిదే. 1996 నుంచి ఇక్కడ ఎస్పీదే పట్టు. దీంతో ఈసారి మైన్‌పురి ఉపఎన్నిక రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు