Sandeshkhali: భాజపా అభ్యర్థిగా ‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు..

Sandeshkhali: సందేశ్‌ఖాలీలో షాజహాన్‌ షేక్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళకు భాజపా టికెట్‌ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆమె బసిర్‌హట్‌ నుంచి పోటీ చేయనున్నారు.

Published : 25 Mar 2024 10:12 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లుు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ ప్రాంతం మరోసారి తెరపైకి వచ్చింది. ‘సందేశ్‌ఖాలీ’ వివాదంలో బాధిత మహిళకు భాజపా (BJP) టికెట్‌ ఇవ్వడమే ఇందుక్కారణం.

భాజపా ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌ స్థానం నుంచి రేఖా పత్రాను నిలబెట్టింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే సందేశ్‌ఖాలీ గ్రామం ఉంది. షాజహాన్‌ షేక్‌ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖ.. కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. అతడి అనుచరుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

కేరళలో భాజపా ఎంపీ అభ్యర్థిగా ఆరు భాషల ప్రవీణ అశ్విని

ఆందోళనల సమయంలో భాజపా నేత సువేందు అధికారి.. రేఖ ఇంటికి వెళ్లి అండగా నిలిచారు. ఇటీవల ప్రధాని మోదీ బరసత్‌ పర్యటనకు వచ్చిన సమయంలో రేఖతో పాటు సందేశ్‌ఖాలీ మహిళలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కమలం పార్టీ ఆమెకు టికెట్‌ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బసిర్‌హట్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ నేత, నటి నుష్రత్‌ జహాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆమెను పక్కనబెట్టి హజీ నురుల్‌ ఇస్లామ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలుండగా.. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా టీఎంసీ, భాజపా మధ్యే పోరు నెలకొంది. విపక్ష ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఇటీవల తృణమూల్‌ ప్రకటించింది. మొత్తం స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు