Odisha: డబుల్‌ ఇంజిన్‌ పాలనకే ఓటు

ఒడిశాలో నవీన్‌ శకానికి తెరపడింది. కమలం విరబూసింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఆధిక్యత సాధించింది. మోదీ గ్యారంటీని ఓటర్లు విశ్వసించారు.

Published : 05 Jun 2024 06:32 IST

ఒడిశాలో పనిచేసిన మోదీ మ్యాజిక్‌ 
కలిసొచ్చిన భాజపా హామీలు
బిజద కొంపముంచిన అవినీతి, పాండ్యన్‌ వైఖరి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశాలో నవీన్‌ శకానికి తెరపడింది. కమలం విరబూసింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఆధిక్యత సాధించింది. మోదీ గ్యారంటీని ఓటర్లు విశ్వసించారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించింది. 25 ఏళ్ల బిజూ జనతాదళ్‌ (బిజద) పాలనకు మంగళం పాడారు.

ఒడిశాలో మోదీ మ్యాజిక్‌ పనిచేసింది. అభివృద్ధే తమ అజెండాగా పేర్కొన్న మోదీ మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం చేశారు. ఖనిజ సంపదను వినియోగంలోకి తెస్తామని, పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో యువత విశ్వసించింది. అన్నదాతలకు న్యాయం చేస్తామని, నీటి పారుదల రంగానికి పెద్దపీట వేస్తామని, ధాన్యం మండీల్లో జరుగుతున్న అవినీతికి పాతరేసి క్వింటాలుకు రూ.3,100 మద్దతుధర (ఎంఎస్‌పీ) చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చి వారి ఓట్లు సొంతం చేసుకున్నారు.

శ్రీక్షేత్ర అస్త్రం గురి తప్పలేదు

భాజపా ప్రయోగించిన శ్రీక్షేత్ర అస్త్రం ఓటర్లను సూటిగా తాకింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తూర్పు తీరధామం పురీ జగన్నాథుడి  సన్నిధిలో అవినీతి, అక్రమాలు, భక్తుల అసౌకర్యాలు ప్రసార సాధనాల్లో నిత్యం చర్చనీయాంశమయ్యాయి. రత్నభాండాగారం విషయంలో బిజద పాలకుల వైఖరి ప్రజల్లో అనుమానాలకు తావిచ్చింది. ఇది గమనించిన ప్రధాని శ్రీక్షేత్రంలో జరుగుతున్న అవకతవకలపై ఉక్కుపాదం మోపి అయోధ్య, కాశీ తరహా సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. దీన్ని నమ్మిన ప్రజలు ఆ పార్టీకి అండగా నిలిచారు.

హామీలను విశ్వసించారు

మహిళల కోసం ఒడిశాలో సుభద్ర పథకం అమలు చేస్తామని భాజపా మేనిఫెస్టోలో ప్రకటించింది. అతివలకు రూ.50 వేలు వోచర్‌ చెక్కులు ఇస్తామని, ఈ మొత్తాన్ని వారు తమ కుటుంబ సంక్షేమానికి వినియోగించుకోవచ్చని పేర్కొంది. పీఎం సూర్యఘర్‌ యోజన కింద ఉచిత విద్యుత్తు, ఎస్‌హెచ్‌జీ మహిళలను లక్షాధికారులను చేస్తామని, 25 లక్షల పేద కుటుంబాలకు పీఎంఏవై ఇల్లు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. బీఎస్‌కేవై స్థానంలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం గురించి భాజపా నేతలు విపులంగా వివరించి అమలుపరుస్తామన్నారు.

చిట్‌ఫండ్‌ బాధితులకు భరోసా

రాష్ట్రంలో 20 లక్షల మంది చిట్‌ఫండ్‌ బాధితులున్నారు. వారికి న్యాయం చేస్తామన్న భాజపా.. 18 నెలల్లో చెల్లింపులు తథ్యమని, అక్రమాలకు పాల్పడిన వారికి కారాగారానికి తరలిస్తామని హామీ ఇచ్చింది. దీన్ని బాధితులు విశ్వసించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలంతా రాష్ట్రంలో ప్రచారం చేయడం ఇదే తొలిసారి. వారంతా బిజద 25 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, భాజపా అధికారంలోకి వస్తే ఏం చేయనున్నది స్పష్టంగా చెప్పారు. ఓటర్లను విశ్వాసంలోకి తీసుకున్నారు. మోదీ ప్రచారం, ఆయన గ్యారంటీ.. రాష్ట్రంలో భాజపా విజయానికి బాటలు వేశాయని పరిశీలకులు విశ్లేషించారు. 

పాండ్యన్‌ తీరుపై అసంతృప్తి 

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవీన్‌ ప్రజలకిచ్చిన హామీలోకి కొన్ని నిలుపుకోలేదు. తనకు విధేయునిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి వి.కార్తికేయ పాండ్యన్‌కు పాలనా బాధ్యతలు అప్పగించేశారు. తమిళనాడుకు చెందిన పాండ్యన్‌.. బిజద పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద దిక్కయ్యారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రిని కలవనీయకుండా చేశారని, కోటరీ నిర్మించుకొని రాజ్యాంగేతర శక్తిగా అవతరించారన్న వ్యాఖ్యలు బిజద నేతల్లోనే వినిపిస్తోంది. పాండ్యన్‌ ఆధిపత్యాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. బిజద గెలిస్తే తమిళుడు పాలకుడు అవుతాడని కమలం నేతలు చేసిన ప్రచారం భాజపాకు కలిసొచ్చింది. 


ఆస్తులు పెంచుకున్నారు

నవీన్‌ పాలనలో (అయిదోసారి) బిజద నేతలు భారీగా ఆస్తులు పెంచుకున్నారు. మరోవైపు యువత ఆశలు నెరవేరలేదు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా చెప్పుకోదగ్గ నియామకాలు లేవు. ఔట్‌సోర్స్‌ పేరిట నవీన్‌ ప్రభుత్వం విద్యావంతులను చిన్నచూపు చూసింది. ఎన్నికలకు ముందుగా స్వల్పస్థాయిలో పోస్టులు భర్తీ చేసినా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నది స్పష్టమైంది. గనులు, ఇసుక, బొగ్గు, నిర్మాణరంగాల్లో అవినీతి తారస్థాయికి చేరింది. కొవిడ్‌ విస్తరించిన తర్వాత సీఎం జనాలకు దూరమయ్యారు. చివరికి ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలోనూ అదే జరిగింది. పార్టీకి విధేయులుగా ఉన్న ఎంతో మందిని పక్కన పెట్టేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని