BJP: వారు తిరస్కరణ మోడ్‌లో ఉన్నారు: భాజపా

తాము ఎన్నడూ మీడియా, ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls)ను బాయ్‌కాట్ చేయలేదని, కాంగ్రెస్‌ కూడా పారిపోకుండా ఓటమిని ధైర్యంగా ఎదుర్కోవాలని భాజపా అగ్రనేత అమిత్‌ షా (Amit shah) సూచించారు.  

Published : 01 Jun 2024 11:55 IST

దిల్లీ: ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలపై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ (Congress) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసందే. దీనిపై భాజపా(BJP) స్పందించింది. జూన్‌ 4న కూడా ఆ పార్టీ నేతలు తమ బంకర్లలో ఉండటం మంచిదని ఎద్దేవా చేసింది.

‘‘తమ ముందు ఘోరపరాజయం ఉందని కాంగ్రెస్‌కు తెలిసిపోయింది. ఏ ముఖంతో ప్రజలు, మీడియాను ఎదుర్కొంటుంది?అందుకే ఎగ్జిట్‌ పోల్స్‌నుంచి పారిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ కొత్తగా వస్తున్నవేమీ కాదు. వారికి ఓటమి గురించి ఏం మాట్లాడాలో అర్థంగాక, వాటిని బహిష్కరిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న దగ్గరి నుంచి వారు తిరస్కరణ మోడ్‌లో ఉన్నారు. భాజపా కూడా ఎన్నో పరాజయాలు చూసింది. కానీ ఎన్నడూ మీడియా, ఎగ్జిట్‌ పోల్స్‌ను బాయ్‌కాట్ చేయలేదు. ఆ పార్టీ నేతలకు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. పారిపోకుండా, ఓటమిని ఎదుర్కోండి. ఆత్మపరిశీలన చేసుకోండి’’ అని భాజపా అగ్రనేత అమిత్‌ షా సూచించారు.

భాజపా నేత అమిత్‌ మాలవీయ స్పందిస్తూ.. ‘‘ఏడో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఫలితాలు మరింత కఠినంగా ఉండే ఉండొచ్చు. కాబట్టి జూన్‌ 4న కూడా కాంగ్రెస్ నేతలు వారి బంకర్లలో ఉండటం మంచిదనుకుంటా’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. శుక్రవారం పవన్‌ ఖేడా మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్‌పై చర్చా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పాల్గొనబోదు. చర్చ ద్వారా ఏదోఒక కచ్చితమైన విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. అందుకే జూన్‌ 4 తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్‌ పాల్గొంటుంది’’ అని చెప్పారు. ఎవరు ఎన్ని చర్చలు పెట్టినా ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల నిర్ణయం మాత్రం మారదని, అలాంటప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఊహాగానాలు ప్రచారం చేయడం ఎందుకుని ప్రశ్నించారు. జూన్ 4న ఫలితాల్లో విజయం ఎవరిదో తేలుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని