Ahsok Gehlot: రెడ్‌ డైరీ, మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌లు భాజపా కుట్రలో భాగం: అశోక్ గహ్లోత్‌

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో భాజపా కుట్ర పూరితంగా గెలవాలనుకుంటోందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్ ఆరోపించారు. ఇందుకోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

Updated : 23 Nov 2023 12:11 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో రెడ్‌ డైరీ, ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులు భాజపా కుట్రలో భాగమని రాజస్థాన్‌ సీఎం అశోక్ గహ్లోత్‌ (Ashok Gehlot) ఆరోపించారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా కుట్ర పూరితంగా గెలవాలనుకుంటోందని విమర్శించారు. వీటిపై సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం జైపుర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గహ్లోత్ ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. 

దివంగత కాంగ్రెస్‌ నాయకుడు రాజేష్‌ పైలట్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గహ్లోత్‌ తప్పుపట్టారు. రాజస్థాన్‌లో గుజ్జర్‌ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ పార్టీ రాజేష్‌ పైలట్‌తో వ్యవహరించిన విధంగానే.. ఎన్నికల అనంతరం సచిన్‌ పైలట్‌ను కూడా పట్టించుకోదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సచిన్‌ స్పందిస్తూ.. పార్టీ మినహా నా గురించి ఇతరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.

గతంలో భాజపా పాలనలో రాష్ట్రంలో గుజ్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన నిర్వహించగా.. వారిపై కాల్పులు జరిపించారని, ఆ ఘటనలో 72 మంది చనిపోయారని అశోక్ గహ్లోత్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఆందోళనలు జరిగినా.. లాఠీ ఛార్జ్ చేయకుండా.. వారికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. రాజస్థాన్‌లో జరిగిన నేరాల వివరాలతో భాజపా ఎన్నికల ప్రకటనలు ఇవ్వడంపై గహ్లోత్‌ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించి, కుట్ర పూరితంగా ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని విమర్శించారు. 

రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ అంశం, ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ప్రధానాస్త్రాలుగా మారాయి. ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. రాజస్థాన్‌లో 200 శాసనసభ స్థానాలకు నవంబరు 25న పోలింగ్‌ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని