Odisha: నవీన్‌ రికార్డు లేనట్లేనా.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ దాటిన భాజపా

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం.. ఒడిశాలో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. నవీన్‌ పట్నాయక్‌ మరోసారి సీఎంగా అధికారం చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. 

Updated : 04 Jun 2024 13:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఒడిశా (Odisha)సీఎం నవీన్‌పట్నాయక్ దక్కేలా కనిపించడం లేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే..అధికార బీజేడీని వెనక్కి నెట్టి భాజపా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం..

మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగానూ ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల సరళి ప్రకారం.. ఆధిక్యంలో భాజపా మెజార్టీ మార్క్‌ను దాటేసింది. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. కానీ కమలం పార్టీ 78 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోపక్క బీజేడీ అభ్యర్థులు 54 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. స్వతంత్రులు రెండు స్థానాల్లో ముందున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారు. చివరకు ముఖ్యమంత్రి పట్నాయక్‌ కూడా ఒకస్థానంలో వెనుకంజలో ఉండటం గమనార్హం. కాంటాబంజి అసెంబ్లీ స్థానంలో ఆయనపై భాజపా అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే హింజిలి అసెంబ్లీ స్థానంలో మాత్రం సీఎం ముందంజలో ఉన్నారు.

ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భాజపాదే ఆధిక్యం. మొత్తం 21 లోక్‌స్థానాలకు గానూ.. 18 చోట్ల కమలం పార్టీ ముందువరుసలో ఉంది. రెండు చోట్ల మాత్రమే బీజేడీ అభ్యర్థులు ముందున్నారు. ఒకచోట కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. నవీన్‌ ఇప్పటివరకు అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని