BJP: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై ఇంకా వీడని సస్పెన్స్‌!

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా అక్కడ ప్రభుత్వాల ఏర్పాటుపై కసరత్తును ముమ్మరం చేసింది.

Published : 07 Dec 2023 21:38 IST

దిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన భాజపా అక్కడ ప్రభుత్వాల ఏర్పాటుపై కసరత్తును ముమ్మరం చేసింది.  మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించనుంది.  శుక్రవారం ఆ మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించి తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెరదించాలని భావిస్తోంది.  భాజపా ఎంపిక చేసిన పరిశీలకులు మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి సీఎంను ఎంపిక అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే  భాజపా ఎన్నికల బరిలోకి దూకిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షణ, తమ పార్టీ విధానాలే తమను గెలిపిస్తాయన్న అంచనాతో పోటీ చేసి ఘన విజయం అందుకుంది.

ఇకపోతే, మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి ఆ పదవికి పోటీ పడుతుండగా.. కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ పటేల్‌, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్లు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌ సావో, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ధరంలాల్‌ కౌశిక్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఓపీ చౌధరి సీఎం రేసులో ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి. అయితే, రమణ్‌ సింగ్‌ మినహా ముగ్గురు నేతలు ఓబీసీ వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే సీఎం పదవికి ప్రధాన పోటీదారుగా కనబడుతున్నారు. ఇటీవల 25మంది ఎమ్మెల్యేలు ఆమెను కలవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని మర్యాదపూర్వక సమావేశమేనని వారు చెబుతున్నప్పటికీ.. పార్టీ అధిష్ఠానం వసుంధర రాజేను సీఎంని చేస్తే తామంతా మద్దతు ఇస్తామని చెబుతున్నారు. అయితే, ఇక్కడ సీఎం రేసులో కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, ఎంపీలు బాలక్‌నాథ్‌, దియా కుమారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తారనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని