Maharashtra: అక్కడ అజిత్‌పవార్‌కు భాజపా మద్దతా.. ఇదేం విడ్డూరం!

లక్షద్వీప్‌ లోక్‌సభ స్థానంలో అజిత్‌ పవార్‌కు భాజపా మద్దతిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎన్సీపీ (శరద్‌పవార్‌) వర్గం ఎద్దేవా చేసింది.

Published : 23 Mar 2024 18:35 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికల ముంగిట మహరాష్ట్రలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అప్పటి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై (Sharad Pawar) తిరుగుబావుటా ఎగురవేసిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde), భాజపాతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ను (Ajit Pawar) కమలదళం అపహాస్యం చేస్తోందని ఎన్సీపీ (శరద్‌పవార్‌) వర్గం ఎద్దేవా చేసింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో లక్షద్వీప్‌ స్థానంలో ఎన్సీపీ అభ్యర్థికి మద్దతిస్తామని భాజపా చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో విమర్శించారు. అక్కడ అసలు ఉనికే లేని భాజపా ఎలా మద్దతిస్తుందని అన్నారు. లక్షద్వీప్‌లో ఎన్సీపీ (అజిత్‌పవార్‌) వర్గం విజయం సాధించేందుకు పూర్తి సహకారం అందిస్తామని భాజపా అధికార ప్రతినిధి వినోద్‌ తావ్డే చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు.

‘‘లక్షద్వీప్‌లో అజిత్‌ పవార్‌కు భాజపా మద్దతిస్తుందట. ఇది ఆయన్ను అపహాస్యం చేయడమే.  2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఒంటరిగా బరిలోకి దిగిన భాజపాకి కేవలం 125 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ స్థానాన్ని ఎన్సీపీ అభ్యర్థి ఫైసల్‌ పీపీ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీ (శరద్‌పవార్‌) వర్గంలో ఉన్నారు’’ అని క్లైడే పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన మహ్మద్‌ అహ్మదుల్లా సయీద్‌పై, ఫైసల్‌ 823 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 22,851 ఓట్లు వచ్చాయి. లక్షద్వీప్‌లోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గానికి తొలివిడతలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 57,594 మంది ఓటర్లు ఉండగా.. 55 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశారు.

ఇటీవల ఎన్సీపీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్‌ పవార్‌, తన వర్గం నేతలతో కలిసి అధ్యక్షుడు శరద్‌పవార్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. శివసేన, భాజపాతో కలిసి ప్రభుత్వంలో భాగమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ తర్వాతి కాలంలో ఆయన వర్గమే అసలైన ఎన్సీపీ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును వారికే కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని