Jyotiraditya Scindia: మేనత్త త్యాగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో జ్యోతిరాదిత్య సింధియా?

Jyotiraditya Scindia: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి యశోధరా రాజే సింధియా ప్రకటించారు. తన మేనల్లుడు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోసం ఆమె పోటీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది.

Updated : 30 Sep 2023 12:38 IST

భోపాల్‌: అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) దగ్గరపడుతున్న వేళ.. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ తప్పదని భావించిన అధికార భాజపా (BJP).. ఈ సారి పెద్ద ఎత్తున కేంద్రమంత్రులు, ఎంపీలను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే పలువురి పేర్లను ప్రకటించగా.. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)ను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, సింధియా కోసం ఆయన మేనత్త, రాష్ట్ర మంత్రి యశోధరా రాజే సింధియా (Yashodhara Raje Scindia) తన సీటును త్యాగం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె తన నిర్ణయాన్ని అధిష్ఠానానికి తెలియజేశారు.

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని యశోధరా రాజే ఇటీవల భాజపా అధినాయకత్వానికి తెలియజేశారు. నాలుగుసార్లు కొవిడ్‌ బారిన పడ్డ ఆమె.. అనారోగ్య కారణాలతోనే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ధ్రువీకరించారు. 2013 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు శివపురి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. ప్రస్తుతం రాష్ట్రంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల కిందటే రాజే తన నిర్ణయాన్ని భాజపా అధిష్ఠానానికి వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదని సమాచారం.

జ్యోతిరాదిత్య అరంగేట్రం ఖాయమేనా?

అయితే యశోధరా రాజే ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో ఆమె మేనల్లుడు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శివపురి స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదంటే గుణ, బమోరి స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మూడు స్థానాలు జ్యోతిరాదిత్య గతంలో ప్రాతినిధ్యం వహించిన గుణ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నవే. ఇదే నిజమైతే జ్యోతిరాదిత్య సింధియా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే తొలిసారి కానుంది.

2001లో తన తండ్రి మాధవరావ్‌ సింధియా మరణం తర్వాత రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జ్యోతిరాదిత్య.. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ‘గుణ’ పార్లమెంట్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019 వరకు వరుసగా అదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2020లో కాషాయ పార్టీలో చేరి రాజ్యసభ నుంచి ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా ఇప్పటికే 79 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ముగ్గురు కేంద్రమంత్రులు, నలుగురు లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని